Pakistan: రంజాన్ నేపథ్యంలో పాక్ ప్రధాని ఆదేశాలను బేఖాతరు చేస్తున్న ఇమామ్ లు
- ప్రజలను మసీదులకు ఆహ్వానిస్తున్న వైనం
- ప్రభుత్వ 20 మార్గదర్శకాలను పట్టించుకోని ఇమామ్ లు
- పోలీసులపై తిరగబడుతున్న ప్రజలు
ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంలో రంజాన్ సందడి మొదలైంది. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ముస్లింలు ప్రార్థనల కోసం మసీదులకు రావొద్దని, ఇళ్లలోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని అనేక దేశాల్లో స్పష్టం చేశారు. పాకిస్థాన్ లోనూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇలాంటి ఆదేశాలే జారీ చేసినా, పట్టించుకున్న వాళ్లే లేరు. ముఖ్యంగా అక్కడి ఇమామ్ లే ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రజలను మసీదులకు ఆహ్వానిస్తున్నారు. కరోనా వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో చాలామంది మతపెద్దలు పాక్ ప్రభుత్వ లాక్ డౌన్ నిర్ణయాన్ని సమర్థించారు.
అయితే రంజాన్ పవిత్ర దినాల నేపథ్యంలో వాళ్ల మనసు మారింది. శుక్రవారం నాటి పవిత్రప్రార్థనలకు పెద్ద ఎత్తున రావాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. దాంతో ప్రజలు పెద్ద సంఖ్యలో బయటికి రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. అయితే రెచ్చిపోయిన ప్రజలు పోలీసు అధికారులపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలకు ముందు దేశంలోని ప్రముఖ ఇమామ్ లు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు.
రంజాన్ పవిత్రమాసంలో మసీదులపై లాక్ డౌన్ ఆంక్షలు తొలగించాలని కోరుతూ అనేకమంది ఇమామ్ లు ఓ లేఖపై సంతకాలు చేశారు. మసీదులు తెరిపిస్తారా? లేక దేవుడి ఆగ్రహానికి గురవుతారా? అంటూ అల్టిమేటం జారీ చేశారు. దాంతో కాస్తంత వెనుకంజ వేసిన ప్రభుత్వం 20 మార్గదర్శకాలతో కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. మసీదులో ఒక్కొక్కరి మధ్య 6 అడుగుల ఎడం ఉండాలని, ఎవరి చాపలు వారే తెచ్చుకోవాలని, చేతులు, కాళ్లు కడగడం వంటి చర్యలను ఇంటి వద్దే పూర్తిచేసుకుని రావాలని ప్రభుత్వం సూచించింది. అంతేకాదు, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం నాడు మత గురువులతో సమావేశమైన సందర్భంగా, ఒప్పందానికి కట్టుబడి ఉండాలంటూ సూచించారు.
దీనిపై విమర్శకులు మండిపడుతున్నారు. జాతీయ సంక్షోభం నెలకొన్న సమయంలో పెత్తనం చేయాల్సింది ప్రభుత్వమా లేక మసీదులా అంటూ ప్రశ్నిస్తున్నారు. దేశం పూర్తిగా మతగురువుల అధీనంలోకి వెళ్లిపోయినట్టు కనిపిస్తోందని ఇస్లామాబాద్ కు చెందిన హసనుల్ అమీన్ అనే ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు.