Sonia Gandhi: మేమిచ్చిన సూచనలు అంత దారుణమా?: సీడబ్ల్యూసీ సమావేశంలో మోదీపై సోనియా నిప్పులు

Sonia Critisises Narendra Modi Over Corona Expand
  • నరేంద్ర మోదీకి ఎన్నో సూచనలు చేస్తూ లేఖలు రాశాను
  • మా సూచనలను హృదయ పూర్వకంగా స్వీకరించడంలో విఫలం
  • కోట్లాది మంది ప్రజల జీవనం స్తంభించిపోయింది
  • ఇప్పటికైనా కళ్లు తెరవాలని సోనియా సూచన
కరోనా వైరస్ మహమ్మారి కట్టడి నిమిత్తం కాంగ్రెస్ పార్టీ కొన్ని సూచనలు చేస్తే, వాటిని దారుణమైనవిగా పరిగణిస్తూ, నరేంద్ర మోదీ సర్కారు ఏ మాత్రం అమలు చేయలేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) సమావేశం జరుగగా, సోనియా పాల్గొన్నారు. తమ సూచనలను స్వీకరించడంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసు చాటుకోలేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.

"మన సమావేశం జరిగిడి మూడు వారాల నుంచి వైరస్ వ్యాప్తి వేగంగా, పలు ప్రాంతాలకు విస్తరించింది. వైరస్ కట్టడి విషయంలో నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తామని హామీ ఇస్తూ, కొన్ని సూచనలు చేశాం. దురదృష్టవశాత్తూ, మా సలహాలు, సూచనలను వారు పక్షపాత దృష్టితో చూశారు. వాటిని దారుణమైనవిగా భావిస్తూ అమలు చేసేందుకు ముందుకు రాలేదు.

 రైతు కూలీలు, వలస కార్మికులు, నిర్మాణ రంగంలో పనిచేసేవారు, అసంఘటిత రంగాల్లోని వారు ఎన్నో కష్టాలు పడుతున్నారు. కోట్లాది మంది ప్రజల జీవనం స్తంభించిపోయింది. అయినా ఈ ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదు" అని సోనియా గాంధీ మండిపడ్డారు.

కరోనా వైరస్ ను తరిమేందుకు క్వారంటైన్, ట్రేసింగ్, టెస్టింగ్ మినహా ప్రస్తుతానికి మరో మార్గం లేదని మోదీకి పదేపదే తాము విజ్ఞప్తి చేశామని గుర్తు చేసిన ఆమె, ఇప్పటికీ టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచాలని తాము చేసిన సూచనను పక్కన పెట్టారని, ఇదే సమయంలో తక్కువ నాణ్యతగల టెస్టింగ్ కిట్లను తెప్పించారని ఆమె విమర్శించారు.

మార్చి 25 నుంచి తాను పలుమార్లు నరేంద్ర మోదీకి లేఖలు రాశానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికీ 5 కిలోల బియ్యం ఇవ్వాలన్న ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించామని, జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ఏప్రిల్ నుంచి జూన్ వరకు మరింత పటిష్ఠంగా అమలు చేయాలని సూచించామని, అయితే తమ సలహాలను పాటించలేదని అన్నారు.
Sonia Gandhi
Narendra Modi
Corona Virus
Sugetions

More Telugu News