Jagan: అనంతపురం, ప్రకాశం, నెల్లూరులలో ఐసీయూ బెడ్ల సంఖ్యను పెంచండి: సీఎం జగన్ ఆదేశాలు

AP CM Jagan review on coronoa virus
  • ఏపీలో ‘కొవిడ్-19’ చర్యలపై జగన్ సమీక్ష
  • రెడ్, ఆరెంజ్ క్లస్టర్లలో నిర్దేశించుకున్న నిబంధనలను పాటించాలి 
  • రైతు భరోసా, మత్స్యకార భరోసా పథకాలపైనా చర్చ
అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఐసీయూ బెడ్ల సంఖ్యను పెంచాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో ‘కొవిడ్-19’ చర్యలపై జగన్ సమీక్షించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన సమీక్షలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ‘కరోనా’ విస్తరణ, పరీక్షల వివరాల గురించి జగన్ కు అధికారులు వివరించారు. ఇప్పటివరకు 41,512 మందికి పరీక్షలు నిర్వహించామని, నిన్న ఒక్క రోజే 5,757 పరీక్షలు చేశామని, ట్రూనాట్ పరీక్షల నమోదుకు ఐసీఎంఆర్ అనుమతిచ్చిందని, కొరియా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు మంచి పనితీరు కనబరుస్తున్నాయని అధికారులు తెలిపారు.

వీలైనన్ని బెడ్లకు ఆక్సిజన్ సరఫరా అయ్యే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు జగన్ సూచించారు. రెడ్, ఆరెంజ్ క్లస్టర్లలో నిర్దేశించుకున్న నిబంధనలను పాటించాలని, గ్రీన్ క్లస్టర్లలో మాత్రం నిబంధనల మేరకు కార్యకలాపాలు కొనసాగేలా చూడాలని జగన్ ఆదేశించారు.

గుజరాత్ లో తెలుగు మత్స్యకారుల అంశంపై కూడా ఈ సమీక్షలో జగన్ ప్రస్తావించారు. గుజరాత్ సీఎంకు ఫోన్ చేసినట్టు చెప్పారు. గుజరాత్ అధికారులతో కలిసి సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రైతు భరోసా, మత్స్యకార భరోసా పథకాలపైనా ఆయన చర్చించారు. లబ్ధిదారుల జాబితాలను గ్రామసచివాలయాల్లో రెండు వారాల పాటు ప్రదర్శించాలని జగన్ స్పష్టం చేశారు. ఆక్వా ఉత్పత్తుల నిల్వ నిమిత్తం కోల్డ్ స్టోరేజ్ లపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
Jagan
YSRCP
Andhra Pradesh
Corona Virus
review

More Telugu News