Chandrababu: పవన్ కల్యాణ్ ఏదైనా మాట్లాడితే విరుచుకుపడుతున్నారు: వైసీపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం
- కరోనాపై ఎవరు ఏం మాట్లాడినా ఎదురుదాడులు చేస్తున్నారు
- రూ.730 చొప్పున కరోనా టెస్టింగ్ కిట్‌లను కొన్నామంటున్నారు
- పొరుగు రాష్ట్రం మాత్రం ఆ కిట్లను కేవలం రూ.350కే తెచ్చుకుంది
- విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా ఎన్నికల గురించి మాట్లాడతారా?
ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏదైనా మాట్లాడితే ఆయనపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మీద కూడా పలు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కరోనాపై ఎవరు ఏం మాట్లాడినా ఎదురుదాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
రూ.730 చొప్పున కరోనా టెస్టింగ్ కిట్‌లను కొన్నామని ఏపీ ప్రభుత్వం మొదట చెప్పిందని, మరోవైపు, పొరుగు రాష్ట్రం మాత్రం ఆ కిట్లను కేవలం రూ.350కే తెచ్చుకుందని తెలిపారు. పట్టుబడిన తర్వాత ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ధర తగ్గుతుందని చెబుతోందని చెప్పారు.
కరోనా విజృంభిస్తోన్న సమయంలోనూ డబ్బుల కోసం కక్కుర్తి పడతారా? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్నది తప్పని చెబితే కేసులు పెడతారా? అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిరోజు ప్రకటనలు చేస్తోంది తప్పా రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవట్లేదని అన్నారు. కూలీలను కూడా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇలాంటి సమయంలో ఆర్డినెన్స్ తెచ్చి ఎస్‌ఈసీని తీసేస్తారా? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా ఎన్నికల గురించి మాట్లాడతారా? అని అన్నారు. కరోనా ఆంక్షలు ఉన్న సమయంలో కనగరాజ్‌ను ఎలా తీసుకొచ్చారని ఆయన నిలదీశారు.