Team India: అవినీతిపై సమాచారం అందించడంలో మన క్రికెటర్లు ఫర్వాలేదు: ఏసీయూ చీఫ్

ACU Chief praises Team India crickters
  • భారత క్రికెటర్లలో చైతన్యం కనిపిస్తోందన్న అజిత్ సింగ్
  • అనుమానాస్పద అంశాలను తక్షణమే తమ దృష్టికి తెస్తున్నారని వెల్లడి
  • ఆటగాళ్లకు పూర్తి అవగాహన కల్పించామన్న ఏసీయూ చీఫ్
కొంతకాలం కిందటి వరకు క్రికెట్ ప్రపంచంలో ఫిక్సింగ్ అనే పదానికి తావులేదు. కానీ, కొందరు క్రికెటర్లు, బుకీలు, ఫిక్సర్లు జెంటిల్మన్ గేమ్ గా పేరుగాంచిన క్రికెట్ ను అపవిత్రం చేశారు. దాంతో ఐసీసీ సహా ప్రతి దేశం క్రికెట్ బోర్డు కూడా సొంతంగా అవినీతి నిరోధక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. భారత్ లోనూ బీసీసీఐకి అనుబంధంగా యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయూ) ఏర్పాటైంది.

తాజాగా ఏసీయూ చీఫ్ అజిత్ సింగ్ మాట్లాడుతూ, అవినీతిపై సమాచారం అందించడంలో భారత్ క్రికెటర్లు ఫర్వాలేదని, ఫిక్సింగ్, ఇతర అవినీతి కార్యకలాపాల పట్ల మనవాళ్లలో చైతన్యం పెరిగిందని అన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు వెంటనే తమకు సమాచారం అందిస్తున్నారని వెల్లడించారు. ఏదైనా అనుమానాస్పదం అనిపిస్తే తక్షణమే తమ దృష్టికి తీసుకువస్తున్నారని వివరించారు.

కాగా, లాక్ డౌన్ ప్రభావంతో ఆటగాళ్లందరూ ఇళ్లకే పరిమితమై సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారని, తత్ఫలితంగా వారికి ఆన్ లైన్ లో అవినీతి సంప్రదింపులు చోటుచేసుకునే అవకాశం ఉందని ఐసీసీ ఏసీయూ అధిపతి అలెక్స్ మార్షల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొనగా, దానిపై అజిత్ సింగ్ స్పందిస్తూ, ఈ విషయంలో బీసీసీఐ ఏసీయూ పూర్తి నియంత్రణలో ఉందని తెలిపారు. సోషల్ మీడియాలో ఎలా మెలగాలో టీమిండియా ఆటగాళ్లకు అవగాహన కల్పించామని, ఫిక్సర్లు, బుకీలు సంప్రదిస్తే ఏంచేయాలో విశదీకరించామని పేర్కొన్నారు.
Team India
BCCI
ACU
Ajith Singh
Corruption
Fixing
Bookie
Cricket

More Telugu News