Lockdown: ప్రధానితో నిర్మలా సీతారామన్ అత్యవసర సమావేశం... కీలక నిర్ణయాలు!

Nirmala Seetaraman Meets Narendra Modi over Lockdown
  • 20 తరువాతి పరిస్థితులపై చర్చ
  • ప్యాకేజీ నిధులు సక్రమంగా వినియోగించాలన్న మోదీ
  • మరిన్ని రంగాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం
కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఓ వైపు రోజురోజుకూ పెరుగుతూ ఉండటం, ఇదే సమయంలో ఆర్థిక వృద్ధి పాతాళానికి పడిపోయిన నేపథ్యంలో, లాక్ డౌన్ కారణంగా దేశంలో నెలకొన్న ఆర్థిక అత్యయిక పరిస్థితి, దాన్నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. ఇండియాలోని హెల్త్ కేర్ సెక్టార్ మినహా మిగతా అన్ని రంగాలూ పూర్తి స్థాయిలో పని చేయడం లేదన్న సంగతి తెలిసిందే. కొన్ని రకాల అత్యవసర విభాగానికి సంబంధించిన ప్లాంట్లు పాక్షికంగా పనిచేస్తున్నాయి. ప్రజా రవాణా, రైళ్లు, విమాన, ఆతిథ్య రంగాలు పూర్తిగా స్తంభించాయి.

ఈ నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ, ఈ నెల 20 తరువాత గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని రకాల ఫ్యాక్టరీలను తెరపించుకునేందుకు, ఐటీ, ఈ-కామర్స్ రంగాల్లో కార్యకలాపాలు జరిపేందుకు, రైతుల వ్యవసాయానికి అనుమతులు ఇవ్వాలని భావిస్తున్నట్టు కేంద్రం నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోదీతో నిర్మలా సీతారామన్ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్రాల పరిధిలో అన్ని రకాల వస్తువుల ఉత్పత్తిని అనుమతించాలని వీరు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఇక హైవేలపై దాబాలు, ట్రక్ రిపేర్ షాపులు, ప్రభుత్వ కార్యకలాపాలపై కాల్ సెంటర్లను 20 తరువాత తిరిగి తెరిపించాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఇండస్ట్రియల్ టౌన్ షిప్ కార్యకలాపాలకు కూడా అనుమతించవచ్చని సమాచారం.

ఇక భారత ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనగా గత నెలలో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా నిధుల వినియోగంపైనా మోదీ, నిర్మల మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీలో భాగంగా ప్రకటించిన 1.75 లక్షల కోట్ల రూపాయలను సక్రమంగా వినియోగించాలని ఈ సందర్భంగా మోదీ ఆదేశించారు. ఈ నిధులతో పేదలకు కావాల్సిన ఆహార ధాన్యాలు, నిత్యావసరాలు, వంట గ్యాస్ తదితరాలను మూడు నెలల పాటు సమకూర్చాలని సూచించారు.
Lockdown
India
Narendra Modi
Nirmala Sitharaman

More Telugu News