Pizza: 72 ఇళ్లకు పిజ్జా డెలివరీ చేసిన ఢిల్లీ కుర్రాడికి కరోనా... వందల మంది క్వారంటైన్!

  • ఢిల్లీలోని మాల్వియా నగర్ లో పిజ్జా సెంటర్
  • కరోనా లక్షణాలున్నా డెలివరీలు చేసిన యువకుడు
  • ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్నందున ఆందోళన అవసరం లేదంటున్న అధికారులు
Nelhi Pizza Delivery Boy Gets Corona

ఢిల్లీలో ఇంటింటికీ తిరిగి పిజ్జా డెలివరీ చేసే ఓ యువకుడికి కరోనా వైరస్ సోకడంతో, అతను డెలివరీ చేసిన 72 కుటుంబాలను, అతనితో పాటు పనిచేసిన మిగతా బాయ్స్ ను, పిజ్జా సెంటర్ స్టాఫ్ ను అధికారులు క్వారంటైన్ చేశారు. ద‌క్షిణ ఢిల్లీలోని మాల్వియా న‌గ‌ర్‌ ప్రాంతంలో ప్ర‌ముఖ‌ పిజ్జా సంస్థ‌ ఓ రెస్టారెంట్ ను నిర్వహిస్తుండగా, ఓ యువకుడు అక్కడ డెలివ‌రీ బాయ్‌ గా ప‌ని చేస్తున్నాడు.

డెలివరీ బాయ్ కరోనా లక్షణాలతో బాధపడుతూ ఉండటంతో, పరీక్షలు చేయించగా, అతనికి పాజిటివ్ వచ్చినట్టు బుధవారం నాడు తేలింది. అతను దగ్గు, జ్వరం, జలుబు ఉన్న సమయంలోనూ పిజ్జాలను డెలివరీ చేశాడని తెలుసుకున్న అధికారులు, అతన్ని ఆసుపత్రికి తరలించారు.

ఆపై అతనితో పాటు పనిచేసిన 16 మందిని, అతన్నుండి డెలివరీ అందుకున్న 72 కుటుంబాలను సెల్ఫ్ క్వారంటైన్ చేశారు. ఈ ఘటనతో మాల్వియా నగర్ ప్రాంతంలో కలకలం రేగింది. కాగా, డెలివరీ సమయంలో పిజ్జా బాయ్, ముఖానికి మాస్క్ వేసుకునే ఉన్నాడని, కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు.

More Telugu News