Rapid Kovid-19 Test: 10 నిమిషాల్లోనే కరోనా పరీక్ష... వినియోగిస్తున్న ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్!

On site Rapid Corona Test for Airport Passengers in Dubai
  • అందుబాటులోకి 'ఆన్‌ సైట్‌ రాపిడ్‌ కొవిడ్‌-19'
  • విమానం ఎక్కాలంటే పరీక్ష తప్పనిసరి
  • అదే విధానాన్ని పరిశీలిస్తున్న భారత విమానాశ్రయాలు
ఇకపై విమానాలు ఎక్కే ప్రయాణికులకు కరోనా లేదని తేల్చేందుకు కేవలం 10 నిమిషాల్లో పరీక్ష నిర్వహించే విధానాన్ని దుబాయ్ అమలులోకి తెచ్చింది. ఇటీవల కొన్ని అంతర్జాతీయ విమానాలకు దుబాయ్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా, వాటిని ఎక్కాలని భావించే విదేశీయులకు ఈ పరీక్షలు తప్పనిసరి. 'ఆన్‌ సైట్‌ రాపిడ్‌ కొవిడ్‌-19' పేరిట పిలిచే ఈ టెస్ట్ లో ఫలితం 10 నిమిషాల్లో వచ్చేస్తుంది.

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హెల్త్‌ అథారిటీ ఆధ్వర్యంలో మెగా పౌరవిమానయాన సంస్థ ఎమిరేట్స్ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. విమానయాన పరిశ్రమలోనే తొలిసారిగా ఎమిరేట్స్‌ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. కాగా, భారత ఎయిర్ పోర్టులు, ఎయిర్ లైన్స్ సంస్థలు కూడా ఈ విధానాన్ని అధ్యయనం చేస్తున్నాయి. ఈ విధానంలో ఫలితాల కచ్ఛితత్వాన్ని పరిశీలించిన మీదట, ఇదే విధానాన్ని ఇండియాలోనూ అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని అధికారులు వెల్లడించారు.

ఈ పరీక్షా విధానం సజావుగా సాగుతోందని వ్యాఖ్యానించిన ఎమిరేట్స్ సీఈఓ అడెల్ అల్ రేధా, టెస్టింగ్ సామర్థ్యాన్ని మరింతగా పెంచాలని నిర్ణయించామని, ఇతర విమానయాన సంస్థలూ దీన్నే అనుసరించనున్నాయని తెలిపారు. ఎమిరేట్స్ పాసింజర్ల ఆరోగ్య భద్రత తమకు అత్యంత ముఖ్యమని అన్నారు. తమ విమానాల్లో విదేశాలకు వెళ్లాలని భావించే వారికి కరోనా-19 నెగటివ్ సర్టిఫికెట్ తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు.

విమానాశ్రయం టర్మినల్-3లోని గ్రూప్ చెకిన్ ఏరియాలో ఈ పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేశామని దుబాయ్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ జనరల్ హుమెయిద్ అల్ ఖుతామీ తెలియజేశారు. రాపిడ్ కొవిడ్-19 టెస్టింగ్ విజయవంతంగా అమలవుతోందని అన్నారు. కాగా, దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఎమిరేట్స్, ఇండియా నుంచి కూడా భారీగా విమానాలు నడుపుతూ ఉంటుంది. పశ్చిమ దేశాలకు వెళ్లే ప్రయాణికుల్లో ఎయిర్ ఇండియా తరువాత అత్యధికులు ఎమిరేట్స్ విమానాల్లోనే తమ ప్రయాణాలు సాగిస్తుంటారు.
Rapid Kovid-19 Test
Dubai Airport
Emirates Airlines
Onsite Test

More Telugu News