West Bengal: 20 రోజులుగా తిండిలేక అలమటిస్తున్నాం.. అంటూ జాతీయ రహదారిపై వందలాది కుటుంబాల ఆందోళన

Locals protest on streets claiming no food or ration available in Murshidabad
  • పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఘటన
  • సీఎం ఉచిత బియ్యం హామీ అమలు చేయడం లేదంటూ ఆందోళన
  • అటకెక్కిన భౌతిక దూరం నిబంధన
  • అధికారుల ఆందోళన
ఉచితంగా రేషన్ సరుకులు అందిస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెబుతున్న మాటలు నీటి మూటలే అవుతున్నాయని, 20 రోజులుగా తిండిలేక కడుపు కాల్చుకుంటున్నామంటూ పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లా దోమకల్ మున్సిపాలిటీ పరిధిలోని 400 కుటుంబాలు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగాయి.

ఒకేసారి వందలాదిమంది రోడ్డుపైకి రావడం, మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం నిబంధనను గాలికి వదిలేయడంతో పోలీసు అధికారులు విస్తుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న మున్సిపల్ చైర్మన్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అందరికీ బియ్యం ఇస్తామని, ఆందోళన విరమించాలని కోరారు. తమకు రేషన్‌కార్డులు ఉన్నప్పటికీ డీలర్లు రేషన్ ఇవ్వడం లేదని ఈ సందర్భంగా వారు చైర్మన్‌కు తెలిపారు.

ఓ బాధితుడు మాట్లాడుతూ.. తమ వార్డులోని రేషన్ డీలర్ మనిషికి కిలో బియ్యం చొప్పున ఇస్తున్నాడని, నలుగురైదుగురు ఉన్న కుటుంబానికి అవెక్కడ సరిపోతాయని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ప్రాంతాల్లో చాలామంది పలు రాష్ట్రాల నుంచి వచ్చి పనులు చేసుకుని బతుకుతున్నారని, లాక్‌డౌన్ కారణంగా పనుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొచ్చాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న ఉచిత భోజన పథకం ఊసే లేకుండా పోయిందని పేర్కొన్నాడు. స్పందించిన చైర్మన్ వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జఫికల్ ఇస్లామీ మాట్లాడుతూ.. రేషన్ కార్డులు ఉన్నప్పటికీ బియ్యం ఇవ్వని డీలర్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దోమకల్ మున్సిపాలిటీ పరిధిలో 1.57 లక్షల మంది జీవిస్తున్నారని, ప్రభుత్వం నుంచి 42 క్వింటాళ్ల బియ్యం మాత్రమే రావడంతో సమస్య ఏర్పడిందని అన్నారు.
West Bengal
Murshidabad
protest
Corona Virus

More Telugu News