Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు హృదయపూర్వక పాదాభివందనం: బండ్ల గణేశ్

Heatful thanks to Pawan Kalyan says Bandla Ganesh
  • 'తీన్ మార్' చిత్రం నా జీవితంలో ప్రత్యేకమైనది
  • నన్ను ప్రేమించే వాళ్లను నేను ప్రేమిస్తా
  • నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే సినీ నిర్మాత బండ్ల గణేశ్ కు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ చిన్న అవకాశం వచ్చినా పవన్ పై తన అభిమానాన్ని ఆయన చాటుకుంటుంటారు. పవన్ హీరోగా ఆయన నిర్మించిన 'తీన్ మార్' చిత్రం విడుదలై 9 ఏళ్లు గడిచింది. దీంతో బండ్ల గణేష్ తన అనుభూతులను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

''తీన్ మార్' చిత్రం' నా జీవితంలో ఓ ప్రత్యేకమైనది. ఈ చిత్రం విజయం సాధించకపోయినప్పటికీ... నాకు ఓ అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. కాశీ, మైసూర్, దక్షిణాఫ్రికా, అమెరికా, థాయ్ లాండ్ సహా మరెన్నో అద్భుతమైన లొకేషన్స్ లో ఈ చిత్రాన్ని నిర్మించాము. హృదయానికి హత్తుకునే ఎన్నో అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి. ఉదాహరణకు 'అందంగా లేదని అమ్మను, కోపంగా ఉన్నాడని నాన్నను వదలలేవు కదా' అనే డైలాగ్.

ఈ చిత్రానికి మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈరోజు ఈ సినిమా సాంగ్స్ విన్నా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఉదాహరణకు 'వయ్యారాల జాబిల్లి' సాంగ్. అర్జున్ పాల్వాయ్ గా, వేలాయుధంగా మా బాస్ అద్భుతంగా నటించారు. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం విజయం సాధించలేకపోయినప్పటికీ...  త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని నాకు ఇచ్చిన నా దైవ సమానులైన పవన్ కల్యాణ్ గారికి ఇంకొక్కసారి హృదయపూర్వక పాదాభివందనం.

ఇక నుంచి నన్ను ప్రేమించే వాళ్లని నేను ప్రేమిస్తా. నన్ను ఒక్క శాతం ప్రేమిస్తే... నేను 100 శాతం ప్రేమిస్తా. నా ప్రేమ వన్ సైడ్ లో ఉండదు.

అందరికీ ఇంకొక్క సారి చెప్పేదేంటంటే... నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఎవరి రాజకీయాలతో నాకు అవసరం లేదు. ఎవరు మంచి చేసినా... వారిని మెచ్చుకుంటా. కరోనా వంటి మహమ్మారిని చూసిన తర్వాత కూడా మనం నిజాయతీగా ఉండకపోతే మన జన్మ వ్యర్థమని నమ్ముతున్నా. ప్రేమిస్తే ప్రాణం ఇస్తా. ప్రేమించకపోతే దూరంగా ఉంటా. నీ ప్రేమకు బానిసను' అంటూ బండ్ల గణేశ్ వరుస ట్వీట్లు చేశారు.
Pawan Kalyan
Bandla Ganesh
Teenmaar
Tollywood
Janasena

More Telugu News