Corona Virus: ఏపీలో 427కు పెరిగిన కరోనా కేసులు.. గుంటూరులో ఒకరి మృతి

Another 22 cases registered in Andhrapradesh
  • ఏపీలో నిన్న ఒక్క రోజే 22 కేసుల నమోదు
  • ఏడుకు పెరిగిన మృతుల సంఖ్య
  • 89 కేసులతో గుంటూరు టాప్
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ప్రతాపాన్ని చూపిస్తోంది. అక్కడ ప్రతి రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న కొత్తగా మరో 22 కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 427కు చేరుకుంది. నిన్న గుంటూరులో 14, నెల్లూరులో 4, కర్నూలులో 2, చిత్తూరు, కడప జిల్లాలో ఒక్కోటి చొప్పున నమోదయ్యాయి.

అలాగే, కరోనా బారినపడి గుంటూరులో ఓ వ్యక్తి మరణించాడు. జిల్లాలోని దాచేపల్లికి చెందిన బాధితుడు శ్వాస సంబంధిత సమస్యలతో ఈ నెల 9న పిడుగురాళ్ల ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరులోని ఐడీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అతడి నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా కరోనా పాజిటివ్ అని తేలింది. అతడు పదో తేదీ అర్ధరాత్రి దాటాక 1:30 సమయంలో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది.

65 ఏళ్ల వృద్ధుడు ఒకరు కోలుకుని విజయవాడ జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దీంతో కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 12కి చేరింది. కాగా, గుంటూరులో అత్యధికంగా 89 కేసులు నమోదు కాగా, ఆ తర్వాతి స్థానంలో కర్నూలు (84), నెల్లూరు (52) ఉన్నాయి. అనంతపురంలో అత్యధికంగా 15 కేసులు నమోదయ్యాయి.
Corona Virus
Andhra Pradesh
Guntur District

More Telugu News