Reliance Power: మధ్యప్రదేశ్ లోని రిలయన్స్ ప్లాంటు నుంచి విష పదార్థాలు లీక్... ఐదుగురి మిస్సింగ్!

  • రిలయన్స్ పవర్ నిర్వహణలో ప్లాంటు
  • చెరువంత సైజులో చేరుకున్న వ్యర్థాలు
  • నిద్రిస్తున్న వారు కొట్టుకుపోయారంటున్న గ్రామస్థులు
  • చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్
5 Missing After Leak from R Power

మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీలో రిలయన్స్ పవర్ నిర్వహిస్తున్న కోల్ పవర్ ప్లాంటు నుంచి విడుదలైన వ్యర్థాలు ఓ చిన్న సైజ్ చెరువంత ప్రాంతానికి విస్తరించగా, ఐదుగురు గ్రామస్థులు కనిపించకుండా పోవడం కలకలాన్ని రేపింది. భోపాల్ కు దాదాపు 680 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగ్రౌలీ ప్రాంతంలో 10 బొగ్గు ఆధారిత విద్యుత్ తయారీ కర్మాగారాలు ఉండగా, గడచిన ఏడాది వ్యవధిలో ఈ తరహా ఘటనలు మూడు జరగడం గమనార్హం.

ఇక ప్లాంటు నుంచి విడుదలైన వ్యర్థాలు వ్యవసాయ భూములనూ ఆక్రమించినట్టు స్థానికులు తీసుకున్న ఫొటోలు, వీడియోలు తెలుపుతున్నాయి. "ఈ వ్యర్థాలు విడుదలైన సమయంలో తమ ఇళ్లలో నిద్రిస్తున్న ఐదుగురు కొట్టుకుపోయారు. ఇది రిలయన్స్ పవర్ నిర్లక్ష్యమే. గ్రామస్థులను వెతికేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం. పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఈ విషయంలో రైతులకు నష్టపరిహారాన్ని ఇప్పించేందుకు కృషి చేస్తాం. జరిగిన నష్టానికి బాధ్యులపై చర్యలుంటాయి" అని సింగ్రౌలీ కలెక్టర్ కేవీఎస్ చౌదరి వ్యాఖ్యానించారు.

ఇక్కడి విద్యుత్ కంపెనీలు 21 వేల మెగావాట్ల విద్యుత్ ను తయారు చేస్తుండగా, ఈ ప్రాంతమంతా రెండో అత్యధిక కలుషిత ప్రాంతంగా ఘజియాబాద్ తరువాతి స్థానంలో నిలిచిందని కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. గతంలో ఇక్కడి ఎస్సార్ ప్లాంట్, ఆపై ఎన్టీపీసీ ప్లాంటు నుంచి కూడా ఇదే విధంగా రసాయన వ్యర్థాలు విడుదలయ్యాయి. తమ ఫ్యాక్టరీల నుంచి వచ్చే బూడిద వ్యర్థాలు సమీప ప్రాంతాలను కలుషితం చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని కంపెనీలు చెబుతున్నా, వాస్తవ పరిస్థితుల్లో అది జరగడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

More Telugu News