Corona Virus: కరోనా వ్యాక్సిన్ వచ్చాకే లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలి.. పరిశోధకుల సలహా

Study warns of coronavirus resurgence if lockdowns eased too soon
  • ఇప్పుడే నిబంధనలు సడలిస్తే  వైరస్ పునరుజ్జీవం చెందుతుంది
  • హాంకాంగ్ పరిశోధకుల అధ్యయనం హెచ్చరిక
  • వ్యాక్సిన్ వచ్చేందుకు 12 నుంచి 18 నెలల సమయం

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాకే ఆయా దేశాల్లో లాక్‌డౌన్‌ ను పూర్తిగా ఎత్తివేయాలని పరిశోధకులు చెబుతున్నారు. లేదంటే వైరస్ పునరుజ్జీవనం చెందుతుందని హంకాంగ్ కేంద్రంగా పని చేస్తున్న పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చైనాలో కొవిడ్-19 వ్యాప్తిపై చేసిన తమ అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించామని చెప్పారు.  

లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడంతో మొదటి దశ వ్యాప్తిని చైనా సమర్థవంతంగా అడ్డుకోగలిగిందన్నారు. అయితే, కొవిడ్ 19ను తట్టుకునేందుకు మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలని అన్నారు. అది జరగకముందే సాధారణ జీవనం ప్రారంభమైతే  వైరస్ రెండో దశ వ్యాప్తి మరింత ప్రమాదకరంగా ఉంటుందన్నారు. కాబట్టి  చైనా ఇప్పుడు మరింత చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు. లేదంటే వ్యాపార సముదాయాలు, పాఠశాలలు, ఫ్యాక్టరీలో పనులు తిరిగి మొదలైన తర్వాత వైరస్ మళ్లీ పుంజుకొని, అందరికీ వ్యాప్తి చెందుతుందని ఈ పరిశోధనకు సహ నాయకత్వం వహించిన ప్రొఫెసర్ జోసెఫ్ ట వు  ఒక ప్రకటనలో తెలిపారు.

చైనాలో ఇప్పుడు వైరస్ పునరుత్పత్తి (ఒకరి నుంచి మరొకరికి  వైరస్ వ్యాప్తి) తగ్గిపోయింది. ఇది వరకు ఒకరి నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి వైరస్ సోకగా.. ఇప్పుడు ఆ సంఖ్య ఒకటికి తగ్గింది. కానీ, ప్రజల సాధారణ జీవితం మళ్లీ మొదలైతే మాత్రం ఈ సంఖ్య వేగంగా పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

‘లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ప్రజలు సామాజిక దూరం పాటించడంతో పాటు వాళ్ల పరివర్తనలో మార్పులను కొంతకాలం కొనసాగించాలి. అలాగే, ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడంతో పాటు వైరస్ పునరుత్పత్తి సంఖ్యను ఒకటికంటే తక్కువ ఉండేలా సమన్వయం చేసుకోవాలి. సమర్థవంతమైన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేంత వరకూ ఇదే వ్యూహాన్ని కొనసాగించాలి’ అని జోసెఫ్ పేర్కొన్నారు.

 కాగా, కొవిడ్ 19కు  వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కనీసం 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News