Visakhapatnam District: 'ఏడడుగుల' బంధం వేడుకకు ఏడుగురే అతిథులు!
- కరోనా కష్టకాలంలో వివాహం
- ఇరువర్గాల తల్లిదండ్రులు, పురోహితుడు
- మరో ఏడుగురు అతిథులు మాత్రమే హాజరు
ఏడడుగుల బంధాన్ని వందేళ్లు గుర్తుంచుకునేలా సంబరంగా నిర్వహించుకోవాలనుకున్న ఆ జంట ఆశ కేవలం ఏడుగురు అతిథుల సమక్షంలో ముగిసింది. కరోనా కష్టకాలంలో పెళ్లి చేసుకోక తప్పని పరిస్థితుల్లో వారే వందలు, వేల మంది అతిథులు అనుకుంటూ ఆ జంట పెళ్లి తంతును పూర్తి చేసుకుంది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని గవరపాలెంలో జరిగిన ఈ వివాహ వేడుకకు ఏడుగురే అతిథులు హాజరు కావడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే... గవరపాలెం తాకాశి వీధికి చెందిన ఈశ్వరరావుకు నిన్న వివాహం జరిగింది. సొంతూర్లో ఘనంగా పెళ్లి చేసుకోవాలని భారీ కల్యాణ మండపం బుక్ చేసుకోవడమేకాక అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈలోగా లాక్‌డౌన్ విధించడంతో వారి ఆశలు అడియాశలు అయ్యాయి. పోలీసుల నిబంధన కారణంగా మండపంలో పెళ్లికే వీలుకాని పరిస్థితి.
అలాగని వివాహాన్ని వాయిదా వేసుకునేందుకు ఉభయ కుటుంబాలు ఇష్టపడక పోవడంతో నిరాడంబరంగా కార్యక్రమాన్ని ముగించారు. ఈ వివాహ వేడుకకు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు, వారి తల్లిదండ్రులు, పురోహితుడితోపాటు మరో ముఖ్యమైన ఏడుగురు అతిథులు మాత్రమే హాజరు కావడం గమనార్హం.