ఎంపిక చేసిన మార్గాల్లో 15 నుంచి రైళ్లు... పక్కా నిబంధనలను ప్రతిపాదించిన అధికారులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎంపిక చేసిన మార్గాల్లో 15 నుంచి రైళ్లు... పక్కా నిబంధనలను ప్రతిపాదించిన అధికారులు!

trains to start with sleeper class coaches
  • మరో ఐదు రోజుల్లో ముగియనున్న లాక్ డౌన్ 
  • కఠిన నిబంధనల మధ్య తిరగనున్న రైళ్లు
  • ఒక్కో క్యాబిన్ లో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే
  • బెర్త్ కన్ ఫర్మ్ అయితేనే ప్రయాణానికి అనుమతి
21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ మరో ఐదు రోజుల్లో ముగుస్తుండగా, ఈ నెల 15 నుంచి రైళ్లను నడిపించేందుకు పక్కా నిబంధనలతో కూడిన ప్రణాళికపై రైల్వే శాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ కొనసాగినా, పలు నిబంధనలు అమలు చేస్తూ, పరిమిత సంఖ్యలో రైళ్లను నడిపించాలని ఇండియన్ రైల్వేస్ యోచిస్తున్నట్టు సమాచారం.

నిన్న ఉన్నతాధికారులతో సమావేశమైన రైల్వే బోర్డు చైర్మన్, రైళ్లను తిప్పడంపైనే ప్రధానంగా చర్చించారు. అన్ని రైళ్లనూ కాకుండా, ఎంపిక చేసిన మార్గాల్లో, రైళ్లను తిప్పాలని, తద్వారా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని గమ్యాలకు చేర్చవచ్చని వచ్చిన సూచనలపై చర్చించిన చైర్మన్, రాష్ట్రాలు దాటకుండా రైళ్లను నడిపించేందుకు విధి విధానాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్టు రైల్వే వర్గాలు వెల్లడించాయి. దీనిపై ఇంకా ఓ తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, కొన్ని రైళ్లను, కట్టుదిట్టమైన నిబంధనలను అమలు చేస్తూ, నడిపించవచ్చని తెలుస్తోంది.

ఇక రైలు ప్రయాణం చేయాలంటే...

అన్ని రైళ్లలో నాన్ ఏసీ స్లీపర్‌ క్లాస్‌ బోగీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. రైళ్లన్నీ గమ్యస్థానం చేరేలోగా, ఒకటి లేదా రెండు స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి. కొన్ని రైళ్లు నాన్‌ స్టాప్‌ పద్ధతిలో నడుస్తాయి. ప్రయాణికులు కనీసం 12గంటల ముందు తన ఆరోగ్య పరిస్థితిపై రైల్వే అధికారులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి. ప్రయాణ సమయంలో కరోనా లక్షణాలు బయటపడితే, అతన్ని మధ్యలోనే దింపేస్తారు.

ఇక బెర్త్ ఖరారైన వారికి మాత్రమే ప్రయాణం చేసేందుకు అనుమతి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వయో వృద్ధులను రైలు ఎక్కనివ్వరు. ప్రయాణ సమయానికి కనీసం నాలుగు గంటల ముందు రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. ప్రయాణికులంతా విధిగా సామాజిక దూరం పాటిస్తూ, థర్మల్‌ స్క్రీనింగ్ పరీక్షల అనంతరమే రైళ్లు ఎక్కాలి. ప్లాట్‌ ఫామ్ టికెట్ల విక్రయాలను అనుమతించరు.

థర్మల్ స్క్రీనింగ్ తరువాత, నామమాత్రపు రుసుము చెల్లించి, గ్లౌజులు, మాస్క్ లను కొనుగోలు చేసి, రైళ్లలోకి వెళ్లాలి. ఇక రైలు బోగీలో క్యాబిన్ లో ఇద్దరు ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. సైడ్‌ బెర్తులు ఖాళీగానే ఉంటాయి. రైళ్లలో ఏ విధమైన తినుబండారాల విక్రయాలనూ అనుమతించరు. ఈ నిబంధనల మధ్య రైళ్లను నడిపించే విషయమై ఒకటి, రెండు రోజుల్లో తుది నిర్ణయం వెలువడవచ్చని, ఓ అధికారి వెల్లడించారు. ఇప్పటికే తాము ప్రతిపాదనలు పంపామని, అనుమతుల కోసం వేచి చూస్తున్నామని తెలిపారు.
trains
irctc
Corona Virus
India
Lockdown
Indian Railways

More Telugu News