Telangana: తెలంగాణలో ఆరుగురు కాంట్రాక్ట్ వైద్యుల రాజీనామా.. మళ్లీ వెనక్కి!

Six contract doctors resigns over Corona Virus fears
  • రాష్ట్రంలో అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులు
  • భయంతోనే పని చేస్తున్న వైద్యులు
  • రాజీనామా చేస్తున్న వైద్యులతో చర్చించిన జిల్లా కలెక్టర్
తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లినవారు తిరిగి వచ్చిన తర్వాత ఈ సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్న వారికి ప్రాణాలను సైతం పణంగా పెట్టి వైద్యులు, వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. మరోవైపు, చికిత్స అందిస్తున్న వైద్యులపై కొందరు వ్యక్తులు దాడులకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం పట్ల కూడా వైద్య సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో, కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్న ఆరుగురు వైద్యులు రాజీనామా చేశారు. కరోనా బాధితులు పెరుగుతుండటంతో తమకు కూడా మహమ్మారి సోకుతుందనే ఆందోళనతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే, జిల్లా కలెక్టర్, డీఎంహెచ్ఓ రాజీనామా చేసిన వైద్యులతో చర్చించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాజీనామా చేయడం సరికాదని సూచించారు. దీంతో, వారు తమ రాజీనామాలను ఉపసంహరించుకుని విధులకు హాజరయ్యారు. చర్చల సందర్భంగా ఓపీ సేవల్లో సామాజిక దూరం పాటించేలా చూడాలని వైద్యులు కలెక్టర్ ను కోరారు. దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అంతేకాదు, వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రకటించారు.
Telangana
Corona Virus
Contract Doctors
Resign

More Telugu News