Corona Virus: దేశంలో మరిన్ని పెరిగిన కరోనా కేసులు.. 24 గంటల్లో 601 కొత్త కేసుల నమోదు!
- 2,902 మందికి కరోనా వైరస్
- 24 గంటల్లో 12 మంది మృతి
- 68కి చేరిన కరోనా మృతులు
- కోలుకున్న 183 మంది
దేశంలో కరోనా కేసులు, మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు దేశంలో 2,902 మందికి కరోనా వైరస్ సోకిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. గత 24 గంటల్లో అత్యధికంగా 601 కేసులు నమోదయ్యాయని తెలిపింది. 24 గంటల్లో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. 12 గంటల్లో 355 కేసులు నమోదయ్యాయి.
24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 68 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌కు హాజరైన వారి కారణంగా దేశంలో వారం రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ఆ సభ కారణంగా ఢిల్లీ, తమిళనాడులో అమాంతం కరోనా కేసులు పెరిగిపోయాయి. కాగా, దేశంలో మొత్తం 2,902 మందికి కరోనా వైరస్ సోకగా వారిలో 2,650 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 183 మంది కోలుకున్నారు.