Tablighi Jamaat: పాకిస్థాన్‌లోనూ తబ్లిగీ జమాత్ కేంద్రంలో కలకలం.. పలువురికి కరోనా పాజిటివ్

Pakistan places Raiwind under complete lockdown after Tablighi Jamaat members tested coronavirus positive
  • రైవిండ్ మర్కజ్‌లో 40 మంది మత బోధకులకు కరోనా
  • మరో 50 మంది అనుమానితులు
  • రైవిండ్ నగరాన్ని పూర్తిగా లాక్‌ డౌన్‌ చేసిన అధికారులు
మన దేశంలో కరోనా విజృంభణకు కేంద్ర స్థావరంగా మారిన తబ్లిగీ జమాత్ సంస్థ వల్ల పాకిస్థాన్‌లో కూడా ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ సంస్థకు చెందిన 40 మత బోధకులకు కరోనా పాజిటివ్ తేలడం కలకలం సృష్టించింది. దాంతో పాకిస్థాన్‌లో తబ్లిగీ జమాత్ ప్రధాన కార్యాలయం ఉన్న రైవిండ్ నగరంలో ప్రభుత్వం పూర్తి లాక్‌డౌన్ విధించింది. మెడికల్ స్టోర్లు సహా అన్ని దుకాణాలను మూసి వేయడంతో పాటు ప్రజలెవరూ బయటికి రాకుండా ఆంక్షలు విధించింది.

జమాత్‌కు చెందిన మరో 50 మందిలో కూడా వైరస్ వున్నట్టు అనుమానిస్తున్నారు. ఇందులో ఐదుగురు నైజీరియా మహిళలు కూడా ఉన్నారు. వారందరినీ లాహోర్ కు 50 కి.మీ. దూరంలో ఉన్న  కసూర్ లోని క్వారంటైన్ సెంటర్లో చేర్చారు. అలాగే, సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్ సిటీలో తబ్లిగీ జమాత్‌ కు చెందిన 38 మందికి లోకల్ ట్రాన్స్ మిషన్ ద్వారా కరోనా సోకినట్టు గుర్తించారు.

లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన పలువురు జమాత్ మతబోధకులను సింధ్, పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.  ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలెవరూ గుమికూడద్దని హెచ్చరించినప్పటికీ గత నెలలో తబ్లిగీ జమాత్ రైవిండ్‌లో తమ వార్షిక సదస్సు నిర్వహించింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో పలు దేశాలకు చెందిన వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. రైవిండ్‌లోని మర్కాజ్‌లో ప్రస్తుతం 600 మంది మతబోధకులు ఉన్నారు. కాగా, పాకిస్థాన్‌లో గురువారం వరకు 2250 మందికి వైరస్‌ సోకింది. 32 మంది మరణించారు.
Tablighi Jamaat
members
tested coronavirus positive
Pakistan
Raiwind
Lockdown

More Telugu News