Vodafone idea: ‘లాక్ డౌన్’ నేపథ్యంలో నిర్ణయం.. ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ పొడిగించిన వొడా ఫోన్ ఐడియా

Vodafone Idea offers prepaid validity extension for low income feature phone subscribers
  • లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిర్ణయం
  • తక్కువ ఆదాయపు వినియోగదారులకు వర్తించనున్న ఆఫర్
  • ఈ మేరకు వొడా ఫోన్ ఇండియా లిమిటెడ్  ప్రకటన
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఫీచర్ ఫోన్స్ ను ఉపయోగించే తక్కువ ఆదాయపు వినియోగదారుల సౌలభ్యం నిమిత్తం వొడా ఫోన్ ఇండియా లిమిటెడ్ (వీఐఎల్)  ఓ నిర్ణయం తీసుకుంది. వారు వినియోగించే ప్రీ పెయిడ్ ప్లాన్స్ పై వ్యాలిడిటీని వచ్చే నెల 17 వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.  వ్యాలిడిటీని పొడిగించడమే కాకుండా, వీరి కోసం రూ.10 టాక్ టైమ్ ను ఉచితంగా అందిస్తున్నట్లు వీఐఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది.

వ్యాలిడిటీ పొడిగించడం ద్వారా ‘వొడా ఫోన్’, ‘ఐడియా’లకు చెందిన లక్షల మంది ఫీచర్ ఫోన్ యూజర్లు తమకు వచ్చే ఇన్ కమింగ్ కాల్స్ ను నిరాటంకంగా రిసీవ్ చేసుకోవచ్చని పేర్కొంది. తక్కువ ఆదాయపు యూజర్లు వినియోగిస్తున్న ఆయా ప్లాన్స్ వ్యాలిడిటీ ముగిసినా కూడా ఈ ఆఫర్ వరిస్తుందని చెప్పింది.

దాదాపు 100 మిలియన్ల ఫీచర్ ఫోన్ల వినియోగదారులకు తాము తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని, అర్హులైన యూజర్లందరికీ వారి వారి అకౌంట్లలోకి రూ.10 టాక్ టైమ్ సాధ్యమైనంత త్వరగా క్రెడిట్ అవుతుందని పేర్కొంది. వ్యాలిడిటీ గడువు ముగిసేలోగా తమ యూజర్లు తమ బంధువులకు, మిత్రులకు ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు  లేదా టెక్స్ట్ మెస్సేజెస్ పంపుకోవచ్చని పేర్కొంది.
 
ప్లాన్ వ్యాలిడిటీ పొడిగింపు, టాక్ టైమ్ సౌకర్యం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం ద్వారా ముఖ్యంగా ఆయా ప్రాంతాలకు వెళ్లిన వలస కార్మికులకు, రోజూ వారి కూలీలకు ప్రస్తుత పరిస్థితుల్లో లాభదాయకంగా ఉంటుందని వొడాఫోన్ ఐడియా మార్కెటింగ్ డైరెక్టర్ అవినాష్ ఖోస్లా పేర్కొన్నారు. యూజర్లకు ఎటువంటి అంతరాయం కలగకుండా తమ నెట్ వర్క్ టీమ్స్ ఇప్పటికే తమ పనుల్లో మునిగిపోయారని తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని స్థానిక అధికారుల నుంచి తమ వినియోగదారులు తెలుసుకోవడానికి ప్లాన్ వ్యాలిడిటీ పొడిగింపు నిర్ణయం ఉపకరిస్తుందని భావించారు.
Vodafone idea
prepaid
plan
Low income group
users

More Telugu News