Corona Virus: కరోనా సోకిన గంటల్లోనే కనిపించే లక్షణాలివి!

Smell and Taste Loss are the First Symptoms of Corona
  • తొలి లక్షణం వాసన చూసే సామర్థ్యాన్ని కోల్పోవడం
  • ఆపై రుచి తెలుసుకోలేకపోతున్న బాధితులు
  • గంటల వ్యవధిలోనే లక్షణాలు తెలుస్తాయంటున్న ఈఎన్టీ నిపుణులు
కరోనా వైరస్ సోకితే, 14 రోజుల్లోగా జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ లక్షణాలు కనిపిస్తే, వారికి కరోనా సోకినట్టుగా అనుమానించ వచ్చని ప్రపంచ ఆరోగ్య నిపుణులు ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే, ఈ లక్షణాలు బయటకు తెలిసే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. వైరస్ సోకిన వారి నుంచి ఎంతో మందికి ఆ వైరస్ వ్యాపిస్తుంది.

అయితే, శరీరంలోకి వైరస్ ప్రవేశించిన గంటల్లోనే రెండు కొత్త లక్షణాలు బయటకు వస్తాయని బ్రిటన్‌కు చెందిన ఈఎన్టీ వైద్యులు గుర్తించారు. వైరస్‌ సోకిన వారు తొలుత వాసనను గుర్తించలేరని, ఆపై తినే ఆహార పదార్థాల రుచిని కూడా కోల్పోతారని వెల్లడించారు. వైరస్ ఊపిరితిత్తుల్లోకి చేరడానికి ముందు ముక్కులో ఆగుతుందని, అందువల్ల వాసన చూసే సామర్థ్యం పోతుందని తెలిపారు.

ఇక ఈ లక్షణాలు కనిపిస్తే, రోగ నిరోధక శక్తి అధికంగా ఉండే యువత వైరస్ బారిన పడినప్పటికీ అన్ని లక్షణాలూ బయటపడేలోపే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉంటాయని వైద్యులు అంటున్నారు. హఠాత్తుగా తాము వాసన పసిగట్టే సామర్థ్యాన్ని కోల్పోయామంటూ తన క్లినిక్‌ కు వచ్చే రోగుల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిందని, కారణం కనుక్కునే ప్రయత్నాల్లో తానుండగా, వారిలో ఎక్కువ మందికి కరోనా సోకినట్టు తెలిసిందని 'ఈఎన్‌టీ యూకే' అధ్యక్షుడు ప్రొఫెసర్‌ నిర్మల్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. ఇక ఈ లక్షణాలు ఉన్న వారికి, వాటి నివారణకు స్టెరాయిడ్స్‌ ట్యాబ్లెట్లను వారం రోజుల పాటు అందించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు,.
Corona Virus
ENT
Smell Capacity
Taste

More Telugu News