మృత్యుపాశమైన ఊయల : చున్నీ మెడకు బిగుసుకుని 14 ఏళ్ల బాలిక మృతి

  • ఊయల చీరకు, చున్నీ చుట్టుకోవడంతో ఘటన 
  • సిద్ధి పేట జిల్లా కల్లేపల్లిలో విషాదం 
  • సమీపంలోనే తల్లి ఉన్నా గుర్తించలేకపోయిన దురదృష్టం

సరదాగా కాసేపు ఊయల ఊగుదామనుకున్న బాలికకు అదే ఊయల తనకు మృత్యుపాశమవుతుందని ఊహించలేకపోయింది.  పద్నాలుగేళ్ల బాలిక మెడలోని చున్నీ, ఊయలగా కట్టిన చీరతోపాటు చుట్టుకుపోవడంతో ఊపిరాడక మృతి చెందిన విషాదకర ఘటన సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లిలో నిన్న సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... గ్రామానికి చెందిన పబ్బతి నర్సయ్య, సరోజ దంపతుల కుమార్తె దివ్య (14). స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న దివ్య పాఠశాలకు సెలవు కావడంతో ఇంట్లోనే ఉంది.

నిన్న సాయంత్రం ఇంట్లో దూలానికి చీరకట్టి ఊయల ఊగుతోంది. ఆ సమయానికి దివ్య మెడలో చున్నీ ఉంది. ఆమెకు సమీపంలోనే దివ్య తల్లి ఇంటి పనులు చేసుకుంటోంది. ఊయల ఊగుతుండగా చీర చుట్టుకుపోయింది. అదే సమయంలో దివ్యమెడలోని చున్నీ చీరలో చిక్కుకోవడంతో మెడకు బిగుసుకుని ఊపిరాడక దివ్య చనిపోయింది.

ఇంటి పనుల్లో నిమగ్నమైన తల్లి ఎంతగా పిలుస్తున్నా కూతురి నుంచి సమాధానం లేకపోవడంతో అనుమానంతో వచ్చి చూసింది. ఊయలలో విగత జీవిగా పడివున్న కూతుర్ని చూసి లబోదిబోమంటూ స్థానికుల సాయంతో కిందికి దింపింది. కానీ అప్పటికే దివ్య చనిపోయింది. దివ్య తల్లి సరోజ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Siddipet District
kallepalli
14year old girl
chunni

More Telugu News