VV Lakshminarayana: నా పేరిట వస్తున్న అసత్య ఆడియో టేపును నమ్మొద్దు: మాజీ జేడీ లక్ష్మీనారాయణ

CBI EX JD Lakshmi Narayana says do not believe fake audio tape with my voice
  • ‘కరోనా’పై భయభ్రాంతులకు గురి చేసేలా ఆ ఆడియో టేపు
  • అందులో నా వాయిస్ తో ఎవరో మాట్లాడారు
  • ఆ ఆడియో టేపు ఎవరి వద్దకు చేరినా ఫార్వర్డ్ చేయకండి
కరోనా వైరస్ గురించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా తన పేరిట సామాజిక మాధ్యమాల్లో ఓ ఆడియో టేపు చెలామణి అవుతుండటంపై సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ (జేడీ) వి.వి.లక్ష్మీనారాయణ స్పందించారు. ఆ ఆడియో టేపుతో  తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను మాట్లాడినట్టుగా అందరూ భావిస్తున్నారని, దీనిని నమ్మొద్దని కోరారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను ఆయన పోస్ట్ చేశారు. అందులో తాను మాట్లాడలేదని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చెప్పి ఎవరో కావాలని ఈ విధంగా చేయడాన్ని ఖండిస్తున్నానని అన్నారు. అలాంటి ఆడియో ఎవరి వద్దకు చేరినా దానిని ఫార్వర్డ్ చేయొద్దని సూచించారు.

ఇలా అబద్ధపు ఆడియో టేపును సృష్టించిన వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ‘కరోనా’ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం, సమాజాన్ని కాపాడుకుందామని పిలుపు నిచ్చారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ కరోనా బారి నుంచి సమాజాన్ని రక్షిద్దామని అన్నారు.
VV Lakshminarayana
Ex-Jd
CBI
Corona Virus
fake audio

More Telugu News