Hyderabad: రోగం వదిలింది... ప్రయాణం మిగిలింది: డిశ్చార్జి అయిన రోగుల దీనావస్థ!

hospital discharge patients suffering due to no way to go home
  • ఆసుపత్రుల నుంచి బయటకు వస్తే అంతా అంధకారం 
  • ఇంటికి చేరే మార్గం లేక వందలాది మంది అవస్థలు 
  • వాహనం సమకూర్చుకుంటే అనుమతిస్తామంటున్న పోలీసులు

వారంతా వారాలు, నెలలు క్రితం రోగానికి చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరిన వారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారు. ఆసుపత్రి సేవలు పూర్తయ్యాయి. రోగం నుంచి కోలుకుంటామన్న ధైర్యం వచ్చింది. కానీ ఆసుపత్రి బయటకు వస్తే ఊరికి వెళ్లే మార్గం కానరాక అంతా అగమ్యగోచరంగా ఉండడంతో వందలాది మంది పేషెంట్లు, వారి సహాయకులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ప్రయాణ సౌకర్యం లేకపోవడం, బయట ఉండేందుకు కూడా అవకాశం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలన్నింటా ఉంది.

ఉదాహరణకు హైదరాబాద్ పరిస్థితే తీసుకుందాం. వరంగల్ జిల్లాకు చెందిన సంతోష్ వెన్నెముక సమస్యతో పది రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని నిమ్స్ లో చేరాడు. శస్త్రచికిత్స పూర్తయింది. వైద్యులు గురువారం డిశ్చార్జి చేశారు. కానీ ఇప్పుడు ఊరికి ఎలా చేరాలో అతని కుటుంబానికి అర్థం కావడం లేదు. ఇలా నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల వద్ద ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు.

ఈ ఆసుపత్రుల్లో చేరే వారిలో ఎక్కువ మంది ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారే. నిరుపేదలు కావడంతో ఎక్కువ మంది ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందిన వారే. నిస్సహాయ స్థితిలో వీరు వంద నంబర్‌కు ఫోన్ చేసి సహాయం కోరుతున్నారు. అయితే తాము వాహనాలను సమకూర్చలేమని, ప్రైవేటు వాహనాన్ని సమకూర్చుకుంటే అది ప్రయాణించేందుకు అనుమతిస్తామంటూ పోలీసులు చెబుతున్నారు. అంతా నిరుపేదలు కావడంతో పెద్దమొత్తంలో చెల్లించి ప్రైవేటు వాహనం సమకూర్చుకునే పరిస్థితి లేకపోవడంతో ఏంచేయాలో అర్థంకాక ఆందోళన చెందుతున్నారు. 

Hyderabad
NIMS
patients
traveling problem

More Telugu News