Wagenor: కరోనా నేపథ్యంలో.. సొంతూరికి వెళ్లేందుకు ఓ కూలీ పడిన తపన ఇది!

Daily wage earner walks hundres kilometers to reach native village in Maharashtra
  • కరోనాతో మహారాష్ట్రలో లాక్ డౌన్
  • రవాణా సౌకర్యాలు లేక 100 కిలోమీటర్లకు పైగా నడిచిన కూలీ
  • పోలీసుల మానవతాదృక్పథం
  • సొంతూరు చేరిన కూలీ
దేశంలో ఎక్కడ చూసినా కరోనా భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా సోకితే ప్రాణాలకు హాని కలుగుతుందన్న భయంతో చాలామంది స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మహారాష్ట్ర కూలీ కూడా కరోనా నేపథ్యంలో సొంత ఊరికి వెళ్లేందుకు ఎవరూ చేయని సాహసం చేశాడు. రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో కాలినడకన ఏకంగా 100 కిలోమీటర్లు పైగా నడిచాడు. ఆ కూలీ పేరు నరేంద్ర షెల్కే. పూణేలో దినసరి కూలీగా పనిచేస్తున్న నరేంద్ర కరోనా భయాలతో సొంత ఊరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

అతడి స్వగ్రామం చంద్రాపూర్ జిల్లాలోని జాంబ్. మొదట పూణే నుంచి నాగ్ పూర్ వరకు రైల్లో సాఫీగానే వెళ్లాడు. అదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో చేసేది లేక కాలినడకన బయల్దేరాడు. దారి మధ్యలో తిందామన్నా ఏమీ దొరకని దయనీయ పరిస్థితుల్లో నీళ్లు తాగి కడుపు నింపుకున్నాడు. అయిన వాళ్లను చూసుకోవాలన్న తపన అతడిని ముందుకు నడిపించింది. అయితే 100 కిలోమీటర్లకు పైగా పయనం సాగించిన తర్వాత పోలీసులు అడ్డుకున్నారు.

కర్ఫ్యూ అమల్లో ఉంటే ఎందుకు బయటికి వచ్చావని నరేంద్రను పోలీసులు ప్రశ్నించారు. దాంతో తన ప్రయత్నాన్ని వివరించాడు. అతడి పరిస్థితి గురించి తెలుసుకున్న సబ్ ఇన్ స్పెక్టర్ తన ఇంటి నుంచి భోజనం తెప్పించాడు. వైద్యులను పిలిపించి నరేంద్ర ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న అనంతరం ఓ వాహనం సమకూర్చి సొంత ఊరికి వెళ్లే ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం అతడికి అధికారులు రెండు వారాల హోమ్ క్వారంటైన్ విధించారు. ఏదేమైనా, విపత్కర పరిస్థితుల్లో ఆ కూలీ చేసింది నిజంగా సాహసమేనని చెప్పాలి.
Wagenor
Maharashtra
Pune
Corona Virus
Lockdown

More Telugu News