kanika kapoor: కనిక మూడు పార్టీల్లో 400 మందిని కలిసింది.. సింగర్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. కేంద్రం అప్రమత్తం

Singer Kanika Kapoor attends three parties
  • లండన్ నుంచి వచ్చిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్
  • తండ్రి వ్యాఖ్యలను ఖండించిన కనిక
  • ఒక్క పార్టీలోనే పాల్గొన్నానన్న సింగర్
ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు సింగర్ కనికా కపూర్ వ్యవహారం కాకరేపుతోంది. లండన్ నుంచి వచ్చిన ఆమె నేరుగా పార్టీలో పాల్గొనడం, దానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కావడం, ఆ తర్వాత ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఆమె ఒక్క పార్టీలోనే పాల్గొందని చెబుతున్నా.. ఆమె తండ్రి రాజీవ్ కపూర్ మాత్రం తన కుమార్తె మూడు పార్టీల్లో పాల్గొందని, దాదాపు 400 మందిని కలిసిందని చెప్పడం తీవ్ర సంచలనమైంది. తన కుమార్తె కనిక మూడు వేర్వేరు పార్టీల్లో దాదాపు 400 మందిని కలిసిందని పేర్కొన్నారు. అందులో ఆరుగురు తమ కుటుంబం వారేనని తెలిపారు. ప్రస్తుతం తామందరం ఐసోలేషన్‌లో ఉన్నట్టు చెప్పారు.

అయితే, తండ్రి వ్యాఖ్యలను కనిక ఖండించింది. తాను ఒకే ఒక్క గెట్ టుగెదర్‌లో పాల్గొన్నానని, 30 మందిని మాత్రమే కలిశానని పేర్కొంది. ఈ  నెల 13న తాను ఒకే ఒక్క పార్టీకి హాజరయ్యానని పేర్కొన్న కనిక.. ఈ వారమంతా చేతులకు గ్లోవ్స్ ధరించే ఉన్నానని తెలిపింది.

మరోవైపు, కనిక పార్టీకి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె తనయుడు దుష్యంత్ సింగ్ సహా పలువురు ప్రముఖులు హాజరు కావడం, దుష్యంత్‌ ఆ తర్వాత పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో పలువురు నేతలను కలవడంతో కేంద్రం అప్రమత్తమైంది. కనిక పార్టీకి హాజరైన వారందరూ అప్రమత్తంగా ఉండాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే తమను సంప్రదించాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు.
kanika kapoor
Bollywood
singer
Corona Virus

More Telugu News