Ayesha Meera: మరి మా కుమార్తె కేసు సంగతేమిటి?: ఆయేషా తల్లి
- నా కుమార్తె బలై 13 ఏళ్లు దాటింది
- నేరస్తుడు డబ్బున్నవాడైతే చట్టాలు అతడిని ఏమీ చేయలేవు
- నిర్భయ తల్లికి చేతులెత్తి మొక్కుతున్నా
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం స్పందించారు. దోషులకు ఉరిశిక్ష అమలు హర్షణీయమన్న ఆమె.. తన కుమార్తె ఆత్మకు శాంతి ఎప్పుడోనని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆమె.. ఈ విషయంలో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్భయ తల్లి పోరాటం తమలాంటి వారికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆమెకు చేతులెత్తి మొక్కుతున్నట్టు చెప్పారు.
తన కుమార్తె బలై 13 ఏళ్లు దాటిపోతున్నా ఇప్పటి వరకు నిందితులనే గుర్తించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ లాంటి బలమైన చట్టాలు ఉన్నప్పటికీ వాటిలో రాజకీయ జోక్యం ఉంటే ఏ కేసు పరిస్థితి అయినా ఇంతేనని అన్నారు. నిర్భయ ఘటన తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో అటువంటి ఘటనలు చాలానే జరిగాయని గుర్తు చేశారు.
దిశ వంటి ఎన్ని చట్టాలు పుట్టుకొచ్చినా అమలులో చిత్తశుద్ధి లోపిస్తే బాధితులకు న్యాయం జరగదన్నారు. నిర్భయ కేసులో న్యాయవాదులు నిందితులకు అండగా నిలవడం సిగ్గుచేటన్న శంషాద్.. తాము మైనారిటీలం కావడం వల్లే తమకు నేటికీ న్యాయం జరగలేదని ఆరోపించారు. నేరస్తుడు డబ్బున్నవాడైతే ఏ చట్టాలూ అతడిని ఏమీ చేయలేవని ఆవేదన వ్యక్తం చేశారు.