Corona Virus: పంజా విసురుతున్న కరోనా.. దేశంలో 169కి పెరిగిన కేసులు

Coronavirus Cases Rise To 169 Says Health Ministry
  • తాజాగా చండీగఢ్ లో మరో కేసు నమోదు
  • మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్న వైరస్ ప్రభావం
  • ఎయిర్ పోర్టుల్లో లక్షల మందికి స్క్రీనింగ్
దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి మెల్లమెల్లగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కేసుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. గురువారం మధ్యాహ్నం సమయానికి దేశవ్యాప్తంగా 169 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్యసంక్షేమ శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు ముగ్గురు మరణించగా.. మరో 15 మంది వైరస్ నుంచి బయటపడి డిశ్చార్జి అయినట్టు తెలిపింది. మిగతా 151 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించింది.

చండీగఢ్ లో కరోనా

తాజాగా చండీగఢ్ లో కొత్తగా కరోనా కేసు నిర్ధారణ అయింది. గత ఆదివారం లండన్ నుంచి ఇండియాకు వచ్చిన 23 ఏళ్ల యువతికి కరోనా ఉన్నట్టు గుర్తించారు. ఆమె వచ్చిన మరుసటిరోజే వైరస్ లక్షణాలు బయట పడ్డాయని, టెస్టులు చేయడంతో కరోనా ఉన్నట్టు గుర్తించామని అధికారులు తెలిపారు. ఆమెతో కాంటాక్ట్ అయిన వారిని ట్రేస్ చేస్తున్నట్టు వెల్లడించారు.

లక్షల మందికి స్క్రీనింగ్

విదేశాల నుంచి ఇండియాకు వస్తున్న వారిని ఎయిర్ పోర్టుల్లోనే స్క్రీనింగ్ చేస్తున్నామని, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 14 లక్షల మందికిపైగా ప్రయాణికులకు స్క్రీనింగ్ చేశామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని.. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 42కు చేరుకుందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. బుధవారం ఒక్కరోజే కొత్తగా ఎనిమిది కేసులు నమోదుకాగా.. మొత్తం కేసుల సంఖ్య 13కు చేరింది.
Corona Virus
COVID-19
chandigarh
Telangana
Maharashtra

More Telugu News