Team India: జట్టులోకి ధోనీ రాకపై సెహ్వాగ్ కామెంట్ ​

Where will he fit in Virender Sehwag over Dhoni return to Team India
  • ధోనీ టీమిండియాలోకి రాలేడని పరోక్ష వ్యాఖ్య
  • జట్టులో ఉన్నోళ్లు మంచి ఫామ్ లో ఉన్నారని వెల్లడి
  • కోహ్లీ తడబాటును సమర్థించిన సెహ్వాగ్
జట్టులో ధోనీకి చోటెక్కడుందని, ఇప్పటికే రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ మంచి ఫామ్ లో ఉన్నారని టీమిండియా మాజీ డాషింగ్ బ్యాట్స్ మన్ వీరేందర్ సెహ్వాగ్ అన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్ లలో రాహుల్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడని, ఇంకా అతడి గురించి ఆలోచించేందుకు వేరే కారణం ఏముంటుందని చెప్పారు. పరోక్షంగా ఇక మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియాలోకి మళ్లీ రావడం ఇక కష్టమేనని వ్యాఖ్యానించారు.

చాలా కాలంగా దూరంగా ఉండటంతో..

ధోనీ ఐసీసీ వన్డే ప్రపంచ కప్ తర్వాతి నుంచి అంతర్జాతీయ క్రికెట్ లో ఆడటం లేదు. ఆ తర్వాత జరిగిన ఏ సిరీస్ లోనూ చాన్స్ రాలేదు. దాంతో ఆయన అంతర్జాతీయ క్రికెట్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. అంతేకాదు బీసీసీఐ కూడా ధోనీ కాంట్రాక్ట్ ను పునరుద్ధరించలేదు. ఈ నేపథ్యంలో ధోనీ రిటైర్ అవుతాడన్న ప్రచారం జరిగింది. దీనిపై ఇటీవల స్పందించిన రవిశాస్త్రి.. ఐపీఎల్ లో బాగా ఆడితే ప్రపంచ కప్ జట్టుకు ధోనీ పేరును పరిశీలిస్తామని అన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడింది. ధోనీ తిరిగి ఆడటంపై సందేహాలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో సెహ్వాగ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

కోహ్లీ మంచి ఆటగాడని కితాబు

అటు ధోనీ రావడం కష్టమని వ్యాఖ్యలు చేసిన సెహ్వాగ్ మరోవైపు విరాట్ కోహ్లీని మాత్రం వెనకేసుకొచ్చారు. కోహ్లీ అద్భుతమైన ఆటగాడని, న్యూజిలాండ్ లో విఫలమవడాన్ని తప్పుబట్టలేమని సెహ్వాగ్ అన్నారు. సచిన్ వంటి దిగ్గజాలే గడ్డుకాలం ఎదుర్కొన్నారని చెప్పారు. న్యూజిలాండ్ బాగా ఆడిందని, ఆ విషయాన్ని మనం అంగీకరించాలని పేర్కొన్నారు.
Team India
India
MS Dhoni
Virender Sehwag

More Telugu News