Chilukuri Balaji: రేపటి నుంచి చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత
- రేపటి నుంచి 25వ తేదీ వరకు మూసివేత
- కరోనా వైరస్ నేపథ్యంలో కీలక నిర్ణయం
- ఇప్పటికే మూతపడ్డ షిర్డీ సాయిబాబా ఆలయం
హైదరాబాద్ శివార్లలో ఉన్న ప్రముఖ దేవాలయం చిలుకూరు బాలాజీ ఆలయం రేపటి నుంచి మూత పడనుంది. మార్చి 19 నుంచి 25వ తేదీ వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రకటించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
ప్రతి రోజు ఈ ఆలయానికి విపరీతమైన రద్దీ ఉంటుంది. శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వైరస్ సోకిన వ్యక్తి స్వామివారి దర్శనానికి వస్తే ఇతరులకు కూడా సోకే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆలయాన్ని మూసివేస్తున్నారు. మరోవైపు దేశంలోని పలు ఆలయాలు కూడా మూతపడుతున్నాయి. షిర్డీ సాయిబాబా ఆలయాన్ని కూడా మూసివేసిన సంగతి తెలిసిందే.