Fever Hospital: ఫీవర్ ఆసుపత్రికి 14 మంది కరోనా అనుమానితులు.. వీరిలో 8 మంది కరీంనగర్ వారే!

14 people admitted in Fever hospital hyderabad
  • ఇండోనేషియా నుంచి వచ్చిన కరీంనగర్ వాసులు
  • కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిక
  • నిన్న ఒక్క రోజే 938 మందికి వైద్య పరీక్షలు
విదేశాల నుంచి వచ్చిన 8 మంది సహా మొత్తం 14 మంది హైదరాబాద్, నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో చేరారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో చేరిన వీరిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆసుపత్రిలో చేరిన వారిలో నగరంలోని వారాసిగూడకు చెందిన యువకుడు (27), అంబర్‌పేటకు చెందిన 24 ఏళ్ల యువతి, ఇండోనేషియా నుంచి ఇటీవల కరీంనగర్ వచ్చిన 8 మంది ఉన్నారు. వీరిలో 30 ఏళ్ల లోపు వయసున్న యువకులు నలుగురు, 64 ఏళ్ల లోపు వయసున్న వారు నలుగురు ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

అలాగే, సైదాబాద్‌కు చెందిన ముగ్గురు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడు కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. కాగా, నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు 938 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వైద్యులు తెలిపారు. వీరిలో 27 మంది పరిస్థితి క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు.
Fever Hospital
Hyderabad
Corona Virus
Karimnagar District

More Telugu News