Corona Virus: ‘కరోనా’పై సినిమా ప్రేమ.. టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం చిత్ర పరిశ్రమలో పోటీ!

Film Industry Busy in Registering Corona Titles
  • ఈ విషయంలో ముందున్న ఎరోస్ ఇంటర్నేషనల్
  • ‘కరోనా ప్యార్ హై’ పేరుతో రిజిస్ట్రేషన్
  • మొదలైన స్క్రిప్ట్ వర్క్
కరోనా వైరస్ ఓ వైపు ప్రపంచాన్ని భయపెడుతుంటే మరోవైపు ఆ పేరుతో సినిమాలు తీసేందుకు వివిధ చిత్ర పరిశ్రమలు పోటీపడుతున్నాయి. కరోనా దెబ్బకు ఓవైపు సినిమాల విడుదల వాయిదా పడుతుంటే, మరోవైపు ఆ పేరును క్యాష్ చేసుకునేందుకు చిత్ర పరిశ్రమ పోటీ పడుతోంది.

ఈ క్రమంలో కరోనా పేరుతో టైటిల్ రిజస్ట్రేషన్ కోసం క్యూ కడుతున్నాయి. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ అయితే అందరికంటే ముందే ‘కరోనా ప్యార్ హై’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించింది. టైటిల్ రిజస్టర్ కావడమే లేటన్నట్టు అప్పుడే స్క్రిప్టు పనులు కూడా మొదలయ్యాయి. దీనిని ఓ ప్రేమ కథగా తీయబోతున్నట్టు చెప్పిన నిర్మాణ సంస్థ.. పరిస్థితులు చక్కబడిన తర్వాత షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు తెలిపింది. కరోనా పేరుతో మరికొన్ని టైటిల్స్ కూడా రిజిస్టర్ అయినట్టు ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ తెలిపింది.

మరోవైపు, కరోనా దెబ్బకు దేశంలోని చిత్ర పరిశ్రమ విలవిల్లాడుతోంది. కరోనా వైరస్ మరింత విస్తరించకుండా అడ్డుకట్ట వేసేందుకు పలు రాష్ట్రాలు ఈ నెలాఖరు వరకు సినిమా థియేటర్లను మూసివేస్తున్నట్టు ప్రకటించాయి. ఫలితంగా ఇప్పటికే విడుదలైన కొన్ని సినిమాలు నష్టాలు మూటగట్టుకుంటుండగా, విడుదల కావాల్సినవి వాయిదా పడుతున్నాయి.  ‘వి’, ‘సూర్యవంశీ’, ‘సందీప్ ఔర్ పింకీ పరార్’ వంటి సినిమాల విడుదల ఇప్పటికే వాయిదా పడింది. టాలీవుడ్, బాలీవుడ్ సహా పలు చిత్రపరిశ్రమలు షూటింగులను వాయిదా వేసుకున్నాయి.
Corona Virus
corona Movies
Tollywood
Bollywood
corona title

More Telugu News