Corona Virus: కరోనాపై బులెటిన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

  • కరోనా విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు
  • కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లండి
  • కరోనా ప్రభావిత దేశాల నుంచి ఇప్పటి వరకు ఏపీకి 675 మంది వచ్చారు
Andhra Pradesh government releases Corona Virus bulletin

ఏపీలో కరోనా వైరస్ నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి బులెటిన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు జిల్లాలో ఒక కరోనా బాధితుడు ఉన్నాడని... 14 రోజుల తర్వాత అతని నమూనాలను మళ్లీ పరీక్షించి విడుదల చేస్తామని చెప్పారు. కరోనా విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, నిరాధార ప్రచారాలను నమ్మొద్దని కోరారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ ఏర్పాటు చేశామని చెప్పారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 0866-2410978ని సంప్రదించాలని తెలిపారు.

కరోనా ప్రభావిత దేశాల నుంచి ఇప్పటి వరకు ఏపీకి 675 మంది వచ్చారని జవహర్ రెడ్డి చెప్పారు. వీరిలో 428 మంది వారి ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారని, 233 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయిందని తెలిపారు. మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. 61 నమూనాలను ల్యాబ్ కు పంపగా వీరిలో 52 మందికి నెగెటివ్ అని తేలిందని చెప్పారు. మరో 8 మంది రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్నా, లేకపోయినా విదేశాల నుంచి వచ్చిన వారు ఇళ్లలోనే ఉండాలని సూచించారు.

More Telugu News