SBI: స్టేట్​ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త.. ఇక మినిమం బ్యాలెన్స్​ ఉంచాల్సిన అవసరం లేదు!

sbi relaxes average monthly balance requirement for savings accounts
  • చార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించిన స్టేట్ బ్యాంకు
  • సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ ఏడాదికి మూడు శాతానికి సవరింపు
  • రుణాలపైనా వడ్డీ రేట్లు స్వల్పంగా తగ్గింపు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) తమ ఖాతాదారులకు శుభవార్త అందించింది. సేవింగ్స్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేసింది. కనీస బ్యాలెన్స్ ఉంచకపోతే ఇప్పటివరకు వేస్తున్న చార్జీలను పూర్తిగా తొలగించింది. ఇదే సమయంలో సేవింగ్స్ ఖాతాలపై ఇచ్చే వడ్డీ రేట్లు, రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను సవరించింది. ఈ మేరకు బుధవారం పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు 44.51 కోట్ల స్టేట్ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. వారందరికీ ఈ నిర్ణయాలు ప్రయోజనం కలిగించనున్నాయి.

నోట్ల రద్దు తర్వాత కనీస బ్యాలెన్స్ నిబంధన

నోట్లు రద్దు తర్వాతి పరిణామాల నేపథ్యంలో స్టేట్ బ్యాంకు కనీస బ్యాలెన్స్ నిబంధనలను అమలు చేసింది. 2018 ఏప్రిల్ నుంచి ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ను తప్పనిసరి చేసింది. మెట్రో ప్రాంతాల్లో నెలవారీ కనీస బ్యాలెన్స్ సగటున రూ.3 వేలు ఉండాలని, అర్బన్ ప్రాంతాల్లో రూ.2 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. వెయ్యి ఉండాలని పేర్కొంది. అప్పటి నుంచి కనీస బ్యాలెన్స్ ఉంచని ఖాతాల నుంచి పెనాల్టీ చార్జీలను వసూలు చేసింది. తాజాగా ఈ కనీస బ్యాలెన్స్ చార్జీలను తొలగించింది. ఇప్పుడు ఖాతాల్లో తప్పనిసరిగా ఎలాంటి బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఉండదు.

డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేట్లలో మార్పులు

స్టేట్ బ్యాంకులో డిపాజిట్లకు సంబంధించిన వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. మార్చి పదో తేదీ నుంచే ఈ వడ్డీ రేట్లు అమల్లోకి తెచ్చినట్టు బుధవారం ప్రకటించింది. సాధారణ సేవింగ్స్ ఖాతాల్లో ఉంచే సొమ్ముకు వార్షికంగా మూడు శాతం వడ్డీని అందించనున్నట్టు తెలిపింది. అదే ఫిక్స్ డ్ డిపాజిట్లపై నిర్ధారిత కాలానికి అనుగుణంగా వడ్డీ రేట్లు ఉన్నాయి. ఇక రుణాలకు సంబంధించి కూడా పది బేసిస్​ పాయింట్ల మేర వడ్డీలను తగ్గిస్తున్నట్టు స్టేట్​ బ్యాంకు ప్రకటించింది.

ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల తీరు..

  • ఏడు రోజుల నుంచి 45 రోజుల మధ్య: 4 శాతం

  • 46 రోజుల నుంచి 179 రోజుల మధ్య: 5 శాతం

  • 180 రోజుల నుంచి ఏడాది మధ్య: 5.5 శాతం

  • ఏడాది నుంచి పదేళ్ల వరకు: 5.9 శాతం

  • సీనియర్ సిటిజన్లకు ఆయా టైం ఫిక్స్ డ్ డిపాజిట్లపై అర శాతం అదనంగా వడ్డీ చెల్లిస్తారు.

SBI
State Bank of India
Interest Rates
Minimum Balance Charges

More Telugu News