Parimal Nathwani: ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పరిమళ్ నత్వానీ
- ఏపీ నుంచి రాజ్యసభకు వెళుతున్న పరిమల్ నత్వానీ
- ఏపీలో పుణ్యక్షేత్రాల సందర్శన
- జగన్ కారణంగానే మూడోసారి అవకాశం వచ్చిందని వెల్లడి
రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యానికి చెందిన పరిమళ్ నత్వానీ చివరి నిమిషంలో ఏపీ నుంచి రాజ్యసభ టికెట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ముఖేశ్ అంబానీ సిఫారసుతో నత్వానీని ఏపీ నుంచి రాజ్యసభకు పంపేందుకు వైసీపీ అధినాయకత్వం అంగీకరించింది. ఈ నేపథ్యంలో, నత్వానీ విజయవాడ వచ్చి ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నత్వానీ మీడియాతో మాట్లాడారు.
సీఎం జగన్ కారణంగానే తాను మూడోసారి రాజ్యసభకు వెళ్లే అవకాశం వచ్చిందని తెలిపారు. ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లనుండడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రాజ్యసభలో ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తానని నత్వానీ అన్నారు. ఆయన ఇవాళ తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. 1997లో రిలయన్స్ గ్రూప్ లో చేరిన నత్వానీ ఆపై అంచెలంచెలుగా ఎదిగి రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ అఫైర్స్ ప్రెసిడెంట్ అయ్యారు. గుజరాత్ కు చెందిన నత్వానీ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.