Etela Rajender: కరోనా బాధితుడికి ధైర్యం చెప్పిన మంత్రి ఈటల రాజేందర్.. జూనియర్ డాక్టర్లకు చురకలు
- గాంధీ ఆసుపత్రిలో కలియతిరిగిన ఈటల
- భయపడాల్సిన అవసరం లేదంటూ కరోనా బాధితుడికి ధైర్యం చెప్పిన మంత్రి
- డాక్టర్లే భయపడితే ఎలాగంటూ జూనియర్ డాక్టర్లకు చురక
హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో కరోనా బారిన పడిన ఒక యువకుడు ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆ యువకుడిని వార్డు కిటికీలోంచి చూస్తూ, తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. సెల్ ఫోన్ ద్వారా అతనితో మాట్లాడి యోగ క్షేమాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. భయపడాల్సిన అవసరం లేదని, క్షేమంగా బయటకు తీసుకొచ్చే బాధ్యత తమదని మంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వచ్చిన వారితో కూడా ఆయన మాట్లాడారు.
గాంధీ ఆసుపత్రిలోని మొత్తం 7 ఫ్లోర్లలో ఈటల రాజేందర్ తిరిగారు. కేవలం వైరస్ లక్షణాలు కలిగిన రోగులతో మాట్లాడేటప్పుడు మాత్రమే ఆయన మాస్క్ ధరించారు. ఇతర రోగులతో మాట్లాడేటప్పుడు మాస్క్ లేకుండా నేరుగా మాట్లాడారు. తద్వారా కరోనా గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదనే సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి వెంట డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ డాక్టర్ రమేష్ రెడ్డి కూడా ఉన్నారు.
మరోవైపు, కరోనా వార్డును నగర శివార్లకు తరలించాలంటూ జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారితో ఈటల మాట్లాడుతూ చురకలు అంటించారు. ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన డాక్టర్లే ఆందోళన చెందితే ఎలాగని ఆయన ప్రశ్నించారు. మంత్రిగా తానే ఇక్కడకు వచ్చినప్పుడు డాక్టర్లయిన మీరు భయపడటంలో అర్థం లేదని అన్నారు. ఐసొలేషన్ వార్డు ఉండటం వల్ల వైరస్ ఎవరికీ సోకదని ధైర్యం చెప్పారు.