IPL: ఐపీఎల్ పై నీలినీడలు... వచ్చేది లేదంటున్న న్యూజిలాండ్ ఆటగాళ్లు!

  • 29 నుంచి మొదలు కానున్న ఐపీఎల్
  • న్యూజిలాండ్ ఆటగాళ్లను పంపించే విషయంలో పునరాలోచన
  • డబ్ల్యూహెచ్ఓ రిపోర్టు తరువాతే ఆలోచిస్తాం
  • స్పష్టం చేసిన రిచర్డ్ బుక్
Corona Effect on IPL

ఈ నెల 29వ తేదీ నుంచి ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 13వ సీజన్ పోటీలు ప్రారంభం కానుండగా, వివిధ టీముల్లో సభ్యులుగా ఉన్న న్యూజిలాండ్ ఆటగాళ్లు, కరోనా భయంతో ఇండియాకు రాలేమని అంటున్నారు. ఇదే విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పీఆర్వో రిచర్డ్ బుక్ వెల్లడించారు. తమ ఆటగాళ్లను పంపేందుకు వెనుకంజ వేస్తున్నామని ఆయన అన్నారు. ఇండియాలో 29 మందికి కరోనా సోకిందని గుర్తు చేసిన ఆయన, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి పూర్తి స్థాయి రిపోర్టును కోరామని, ఆ తరువాత మాత్రమే తమ దేశపు ఆటగాళ్లను ఇండియాకు పంపాలా? వద్దా? అన్న విషయాన్ని ఆలోచిస్తామని తెలిపారు.

కాగా, ఈ సీజన్ లో జిమ్మీ నిశమ్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్), లాకీ ఫెర్గుసన్ (కోల్ కతా నైట్ రైడర్స్), మిషెల్ మెక్‌ క్లాగాన్, ట్రెంట్ బోల్ట్(ముంబై ఇండియన్స్), కేన్ విలియమ్సన్ (సన్‌ రైజర్స్ హైదరాబాద్), మిషెల్ శాంట్నర్ (చెన్నై సూపర్ కింగ్స్) ఆయా జట్ల తరఫున ఆడుతున్నారు. అయితే, వైరస్ నివారణపైనా, ఆటగాళ్లకు వైరస్ సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలపైనా రిపోర్టులను అందుకున్నాకే ఓ నిర్ణయం తీసుకుంటామని రిచర్డ్ బుక్ వ్యాఖ్యానించారు.

కాగా, సాధారణ పరిస్థితుల్లో ఆటగాళ్లతో సెల్ఫీలు దిగేందుకు, వారి ఆటోగ్రాఫ్ లను తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడుతుంటారు. సాధారణ మ్యాచ్ లతో పోలిస్తే, ఐపీఎల్ పోటీల సమయంలో ఆటగాళ్లు, కాస్తంత సేదదీరుతూ ఉంటారు. అభిమానులతో సమయం గడిపేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు. ఈ దఫా కరోనా భయాలతో ఇటువంటి పరిణామాలు జరుగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని బీసీసీఐ ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు సమాచారం.

More Telugu News