Corona Virus: ఏలూరు, విశాఖ, విజయవాడల్లో కరోనా అనుమానిత కేసులు

More Coronavirus suspected cases in Andhrapradesh
  • ఏలూరు ఆస్పత్రిలో చేరిన ఇద్దరు
  • విశాఖలో ముగ్గురు చెస్ట్ ఆస్పత్రికి తరలింపు
  • రక్త నమూనాలను టెస్టులకు పంపించిన డాక్టర్లు
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు, విశాఖ పట్నం, విజయవాడల్లో పలు కరోనా అనుమానిత వ్యక్తులు ఆస్పత్రుల్లో చేరారు. వారందరినీ ఆయా చోట్ల ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. వారి రక్త నమూనాలను టెస్టుల కోసం ల్యాబ్ లకు పంపించారు. రిపోర్టులు రావడానికి ఒకట్రెండు రోజులు పడుతుందని, ఆ తర్వాతే విషయం ఏమిటన్నది తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. 

ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు కరోనా వైరస్ లక్షణాలతో చేరారు. దీనితో అప్రమత్తమైన అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. బాధితుల్లో ఒకరు గత నెల 18న మస్కట్ నుంచి ఇంటికి వచ్చినట్టుగా గుర్తించారు.

విశాఖలో ఓ కుటుంబానికి..

విశాఖపట్నంలో సింగపూర్ నుంచి వచ్చిన ఓ కుటుంబం జలుబు, దగ్గు లక్షణాలతో బాధపడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భార్యాభర్తలు, కుమార్తెను విశాఖ చెస్ట్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి రక్త నమూనాలను టెస్టుల కోసం పంపించారు.

విజయవాడలోనూ ఒక అనుమానిత కేసు

ఇక విజయవాడలో కూడా కరోనా లక్షణాలతో ఒక వ్యక్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. తీవ్రంగా జలుబు ఉన్న ఆ వ్యక్తిని ప్రత్యేక వార్డులో ఉంచిన డాక్టర్లు.. రక్త నమూనాలను పుణె వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో స్థిరపడిన ఆ వ్యక్తి ఇటీవలే 17 రోజుల పాటు జర్మనీకి వెళ్లి వచ్చాడని.. బెంగళూరు మీదుగా విమానంలో హైదరాబాద్ కు వచ్చాడని గుర్తించారు.
Corona Virus
Andhra Pradesh
Vizag
Vijayawada

More Telugu News