Visakhapatnam: విశాఖ నగరంలో సంచలనం రేపిన వృద్ధ దంపతుల హత్య!

older couple murdered in visakhapatnam
షార్ట్స్‌లో చూడండి

విశాఖ మహానగరం 56వ వార్డు పరిధిలో నిన్న వెలుగు చూసిన వృద్ధ దంపతుల హత్య స్థానికంగా సంచలనం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం పట్టపగలే హత్యకు పాల్పడగా గురువారం విషయం వెలుగుచూసింది.

పోలీసుల కథనం మేరకు...ఆర్టీసీలో మెకానిక్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన జెర్రిపోతుల సముద్రం (63), అతని భార్య పార్వతి (58) నరవలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు. ముగ్గురికీ పెళ్లిళ్లు కావడంతో వేర్వేరు చోట్ల ఉంటున్నారు. వీరి పెద్ద కుమార్తె బుధవారం ఉదయం, రాత్రి రెండుసార్లు ఫోన్ చేసినా ఎత్తక పోవడంతో అనుమానం వచ్చి నగరంలోనే ఉంటున్న సోదరి, సోదరుడికి చెప్పింది.

దీంతో వారు అదేరోజు రాత్రి ఇంటికి వచ్చి చూడగా దంపతులు పడక గదిలో విగత జీవులై కనిపించడంతో షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారణ జరిపారు. దంపతుల ముఖాలపై తలదిండు ఆన్చి ఊపిరాడకుండా చేయడం ద్వారా చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

బుధవారం వీరి ఇంటికి సమీపంలో ఓ వివాహ వేడుక జరగడంతో ఆ హడావుడిలో ఎవరూ పట్టించుకోరన్న ఉద్దేశంతో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. అయితే హత్య జరిగిన విధానం చూస్తే ఎవరో తెలిసిన వారి పనేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

మృతురాలి మెడలో బంగారు ఆభరణలు కనిపించకపోవడంతో వాటికోసమే హత్య చేశారా? లేక మరేదైనా కారణం ఉందా? అని ఆరా తీస్తున్నారు. దంపతులకు ఎవరితోనూ ఎటువంటి విభేదాలు లేవని, అందరితోనూ కలివిడిగా ఉండేవారని చుట్టుపక్కల వారు చెబుతుండడంతో హత్యకు కారణాలు అంతుపట్టడం లేదు.

Go Back to Shorts
Visakhapatnam
narava
murder
Crime News

More Telugu News