త్వరలో సౌరవ్ గంగూలీ బయోపిక్?
- తెరకెక్కించనున్న కరణ్ జొహార్!
- దాదాతో పలుమార్లు సంప్రదింపులు
- హీరోను వెతికే పనిలో ఉన్న కరణ్, గంగూలీ
తన బయోపిక్ తీస్తామని చాలా మంది తనను కలిశారని దాదా గతంలో పలుసార్లు ప్రకటించాడు. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నాడు. వెండితెరపై తన పాత్రను హృతిక్ రోషన్ పోషిస్తే బాగుంటుందని కూడా గంగూలీ ఓ సందర్భంలో చెప్పాడు. అయితే, దాదా బయోపిక్ ను తీసే బాధ్యత కరణ్ జొహార్ తీసుకున్నాడని తాజా సమాచారం. దీనికోసం ఇద్దరూ ఇప్పటికే రెండు మూడు సార్లు సమావేశం అయ్యారని, ప్రస్తుతం దాదా పాత్రలో నటించే హీరో కోసం అన్వేషిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సి ఉంది.
గతంలో ఏక్తా కపూర్ ప్రయత్నం:
దాదా జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయాలని ఇంతకుముందు ఏక్తా కపూర్ కూడా ప్రయత్నించారు. ఈ విషయాన్ని గంగూలీనే వెల్లడించాడు. సినిమా గురించి ఏక్తా తనను ఒకసారి కలిశారని చెప్పాడు. కానీ, అంతకుమించి ఏమీ జరగలేదన్నాడు. ఎమ్ ఎస్ ధోనీ బయోపిక్ తనకు బాగా నచ్చిందని, సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ ఓ ప్రత్యేకమైన సినిమా అని దాదా అన్నాడు. అలాగే, 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టుపై తీస్తున్న సినిమాను కూడా తప్పకుండా చూస్తానని చెప్పాడు.