Chandrababu: వైఎస్ హయాంలో నాపై 26 విచారణలు చేయిస్తే ఏమైంది? ఇదీ అంతే!: చంద్రబాబునాయుడు

ChandraBabu fires on YSRCP Government
  • టీడీపీ పాలనపై సిట్ ఏర్పాటుపై బాబు ఫైర్
  • ప్రభుత్వానికి ఎంత కక్ష ఉందో చెప్పడానికి ఇది ఉదాహరణ
  • వైసీపీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు
గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలపై వైసీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ఈ ప్రభుత్వానికి తనపైనా, టీడీపీ మీద ఎంత కక్ష ఉందో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ అని విమర్శించారు. తొమ్మిది నెలల్లో 3 సిట్ లు, అయిదారు కమిటీలు వేయడం ద్వారా తెలుగుదేశం పార్టీనే కాదు ఏకంగా ఏపీనే టార్గెట్ చేశారని, భావితరాలకు తీరని నష్టం చేశారంటూ మండిపడ్డారు. వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడటం, పెట్టుబడులను తరిమేయడం తప్ప ఏం సాధించింది? అని ప్రశ్నించారు.

‘ఇప్పుడీ జీవో 344 వైసీపీ వేధింపులకు పరాకాష్ఠ. గత ఐదేళ్ల నిర్ణయాలపై మీరు సిట్ వేశారు. మీ ఐదేళ్ల పాలనపై రేపు రాబోయే ప్రభుత్వం సిట్ వేస్తుంది. కక్ష సాధించుకోవడం తప్ప, వీటివల్ల ప్రజలకు ఒరిగేది ఏంటి?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

‘గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తనపై 26 విచారణలు చేయిస్తే ఏమైంది? ఇదీ అంతే!‘  అంటూ కొట్టిపారేశారు. టీడీపీ నేతలపై కక్ష సాధించడమే వైసీపీ అజెండా అని, టీడీపీ ఏనాడూ ఎటువంటి తప్పులు చేయలేదని, వైసీపీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని బాబు స్పష్టం చేశారు.
Chandrababu
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News