China: కరెన్సీ నోట్ల మార్పిడితోనూ వ్యాపిస్తున్న కొవిడ్ వైరస్... డబ్బును బయటకు రానివ్వని చైనా!

China Holds Currency Notes in Banks
  • బ్యాంకుల్లో నోట్ల తాత్కాలిక నిల్వ
  • యూవీ కిరణాలతో శుభ్రంచేసిన తరువాతనే చెలామణిలోకి
  • ప్రజల నుంచి రుణాల వసూలు వాయిదా
  • కొత్త నోట్లను విడుదల చేస్తున్న ప్రభుత్వం
ఒకరి చేతి నుంచి మరొకరి చేతుల్లోకి మారే కరెన్సీ నోట్ల ద్వారా కూడా కొవిడ్ (కరోనా వైరస్) వ్యాప్తి చెందుతుందని సైంటిస్టులు హెచ్చరించడంతో, చైనా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కరెన్సీ నోట్లను బయటకు వెళ్లనివ్వరాదని, నోట్లను తాత్కాలికంగా నిల్వ చేయాలని ఆదేశించింది.

ఈ విషయమై చైనా పీపుల్స్ బ్యాంక్ వైస్ చైర్మన్ ఫ్యాన్ యెఫై వివరణ ఇస్తూ, ఇప్పటికే హుబెయ్ ప్రావిన్స్ కు 4 బిలియన్ యువాన్ల కొత్త నోట్లను సరఫరా చేశామని, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే ప్రభుత్వ బ్యాంకుల్లో నుంచి నోట్లను బయటకు వెళ్లనివ్వరాదని నిర్ణయించామని అన్నారు. ముఖ్యంగా బ్యాంకులు, మార్కెట్ల నుంచి వచ్చే నోట్లను నిల్వ ఉంచి, వాటిని యూవీ కిరణాల ద్వారా శుభ్రపరిచిన తరువాతే చెలామణిలోకి పంపుతామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలను మరింతగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

ఇక, వైరస్ పై పోరాడేందుకు ఇప్పటికే 534 బిలియన్ యువాన్లను కేటాయించినట్టు చైనా బ్యాంకింగ్, బీమా నియంత్రణ సంస్థ వైస్ ప్రెసిడెంట్ లియాంగ్ టావో వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి రుణాల వసూలును కూడా వాయిదా వేసుకోవాలని బ్యాంకులను ఆదేశించినట్టు తెలిపారు. కాగా, ఈ వైరస్ సోకిన వారి సంఖ్య అధికారికంగా 66 వేలను దాటగా, ఇప్పటివరకూ 1,523 మంది మరణించారని చైనా ఆరోగ్య శాఖ ప్రకటించింది.
China
Corona Virus
Kovid
Currency

More Telugu News