Ambati Rambabu: చంద్రబాబు దొరికిపోయారు కాబట్టే మాట్లాడడం లేదు: అంబటి

YSRCP MLA Ambati Rambabu fumes over Chandrababu
  • చంద్రబాబు మాజీ పీఎస్ పై ఐటీ దాడుల వ్యవహారంపై రగడ
  • వైసీపీ, టీడీపీ మధ్య వాగ్బాణాలు
  • చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన అంబటి
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తులపై ఐటీ దాడులు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు పర్సనల్ సెక్రటరీగా సుదీర్ఘకాలం పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ పైనా, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిపైనా, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడి కంపెనీలపైనా ఐటీ దాడులు జరిగాయని అన్నారు. నారా లోకేశ్ కు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నవారిపైనా ఈ సోదాలు జరుగుతున్నప్పుడు ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారని తెలిపారు. ఐదు రోజులకుపైగా పెండ్యాల శ్రీనివాస్ పై దాడులు నిర్వహించారని వెల్లడించారు.

తెలుగుదేశం పార్టీకి ఇంత సన్నిహితంగా మెలుగుతున్న వ్యక్తులపై ఐటీ దాడులు జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ సుదీర్ఘంగా ఉపన్యాసాలు ఇచ్చే లక్షణం ఉన్న చంద్రబాబు ఈ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఈ పరిణామం గమనిస్తుంటే ఇందులో ఏదో తతంగం ఉందనిపిస్తోందని, ఇది చంద్రబాబు మీదికే రాబోతోందని స్పష్టంగా తెలుస్తోందని అంబటి స్పష్టం చేశారు. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్లకైనా ఇది అర్థమవుతుందని, చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే తేలుకుట్టిన దొంగ బాధను ఓర్చుకున్నట్టుగా అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు మాజీ పీఎస్ నివాసంపై దాడుల్లో స్పష్టమైన ఆధారాలు దొరికాయని, రూ.2 వేల కోట్ల లావాదేవీలు జరిగాయని గుర్తించామని అధికారులు తెలిపినట్టు అంబటి వివరించారు. ఇదొక మనీ లాండరింగ్ వ్యవహారమని అధికారులు భావిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా పనిచేసిన కాలంలో రాష్ట్రంలో ఐటీ, ఈడీలను అనుమతించబోమని ఘీంకరించారని, ఇప్పుడు రాష్ట్రంలో ఐటీ దాడులు జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.

"దొరికిపోయారు కాబట్టే ఇవాళ మీరు మాట్లాడడంలేదు. ఇప్పుడెక్కడున్నారు మీరు? మీరు, మీ అబ్బాయి హైదరాబాద్ వెళ్లి అక్కడ తలదాచుకునే కార్యక్రమాలు చేపడుతున్నారు. చంద్రబాబు పెద్ద అవినీతిపరుడు. ఇది నేను చెబుతున్నది కాదు, ఎన్టీఆర్ గారు బతికున్న సమయంలో చెప్పిన మాట ఇది. మా అల్లుడు పరమ దుర్మార్గుడు అని చెప్పారు" అంటూ అంబటి ధ్వజమెత్తారు.
Ambati Rambabu
Chandrababu
IT Raids
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News