విజయ్ దేవరకొండ సినిమాల్లో లవ్ .. ఎమోషన్స్ రెండూ ఎక్కువగానే ఉంటాయి. ప్రేమను వ్యక్తం చేయడంలోను .. ఆ ప్రేమను పొందడంలోను ఆయన యాక్టింగ్ స్టైల్ కాస్త ఫోర్స్ గా ఉంటుంది. అలాంటి ఛాయలను తన కథలోను కలుపుతూ క్రాంతిమాధవ్ తయారు చేసుకున్న కథనే 'వరల్డ్ ఫేమస్ లవర్'. తాను మలిచిన నాయక పాత్రకి విజయ్ దేవరకొండ స్టైల్ ను మ్యాచ్ చేస్తూ వెళ్లాడు. మూడు ప్రేమకథల్లో ఆయనను నాయకుడిగా నిలబెట్టాడు. కొత్తదనం కోసం ఆయన చేసిన ప్రయత్నం ఎంతవరకూ ఫలించిందో ఇప్పుడు చూద్దాం.
వంటినిండా గాయాలతో వున్న గౌతమ్ (విజయ్ దేవరకొండ)ను లాకప్ లో వేయడంతో, అప్పటివరకూ జరిగిన సంఘటనలను ఆయన గుర్తుచేసుకోవడంతో ఈ కథ మొదలవుతుంది. గౌతమ్ కి రచయితగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. అందుకోసం ఆయన మంచి జాబ్ ను కూడా వదిలేస్తాడు. అనుకోకుండా తారసపడిన గౌతమ్ ప్రేమలో యామిని (రాశి ఖన్నా) పడుతుంది. తన ఆశయాన్ని గురించి ఆమెకి చెప్పిన గౌతమ్, దానిని సాధించడానికి ఒక ఏడాది పాటు తనకి సహకరించమంటాడు. అందుకు అంగీకరించిన ఆమె, అతనితో సహజీవనం చేస్తుంటుంది.
అయితే ఏడాదిన్నర గడిచినా గౌతమ్ రచనపై దృష్టి పెట్టకపోవడం, సమయాన్నంతా వృథా చేస్తుండటం పట్ల యామిని అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. జీవితాన్ని మత్తునిద్రలో గడిపేస్తూ .. కాలాన్ని నిర్లక్ష్యంతో కరిగించే అతనితో తాను కొనసాగలేనంటూ బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోతుంది. మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధపడుతుంది. తను మారతానంటూ గౌతమ్ ప్రాధేయపడినా ఆమె వినిపించుకోదు. ఆ తరువాత అతను 'ఇల్లందు'లో సువర్ణ (ఐశ్వర్య రాజేశ్)తో వైవాహిక జీవితాన్ని గడుపుతూ, తన పైఆఫీసర్ గా వచ్చిన 'స్మిత' (కేథరిన్) ఆకర్షణకి లోనవుతాడు. అంతేకాదు ప్యారిస్ లో 'ఈజా' అనే పెలైట్ తోను ప్రేమలో పడతాడు. ఆ వైపుగా కథ ఎలా మలుపులు తీసుకుంది? చివరికి ఏం జరుగుతుంది? అనేది తెరపై చూస్తేనే బాగుంటుంది.
దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ కథను మూడు ఎపిసోడ్స్ గా తయారు చేసుకున్నాడు. హైదరాబాదులో విజయ్ దేవరకొండ - రాశి ఖన్నా ఎపిసోడ్ ను, ఇల్లందులో విజయ్ దేవరకొండ - ఐశ్వర్య రాజేశ్ - కేథరిన్ ఎపిసోడ్ ను, ప్యారిస్ లో విజయ్ దేవరకొండ - ఇజబెల్లే ఎపిసోడ్ ను నడిపించాడు. విజయ్ - రాశి ఖన్నా ఎపిసోడ్లో కాస్త సాగతీత ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్లో విజయ్ దేవరకొండ లుక్ .. పాత్ర పరంగా ఆయన ప్రవర్తన 'అర్జున్ రెడ్డి'ని గుర్తుకు తెస్తాయి. ముఖ్యంగా ఆయన హెయిర్ స్టైల్ ఇబ్బందిని కలిగిస్తుంది. ఇక 'ఇల్లందు' ఎపిసోడ్ .. ప్యారిస్ ఎపిసోడ్ ను ఎంతవరకూ చెప్పాలో అంతవరకే చెప్పాడు .. అదీ ఆసక్తికరంగా చెప్పాడు.
రాశిఖన్నా .. ఇజబెల్లేతో రొమాన్స్ .. ఐశ్వర్య రాజేశ్ తో ఎమోషన్ .. కేథరిన్ తో ఆకర్షణ .. శత్రు పాత్ర ద్వారా చిన్నపాటి విలనిజం .. బొగ్గుగని కార్మికుల మధ్య సాగే తెలంగాణ యాసలోని కామెడీ .. అనుకోకుండా జరిగే ఒక చిన్న సంఘటన పెద్దదిగా మారడంతో తప్పని యాక్షన్ తో దర్శకుడు ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నించాడు. అయితే విజయ్ దేవరకొండ రాశి ఖన్నా ఎపిసోడ్ ను ఆయన టైట్ గా రాసుకోలేకపోయాడు. రాశి ఖన్నాకు నచ్చజెప్పే ప్రయత్నంలో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురయ్యే ఫస్టాఫ్ వరకూ బాగుంది. సెకండాఫ్ లో ఇజబెల్లే ఎపిసోడ్ తరువాత కథనం పట్టు సడలుతూ వచ్చింది. ప్రీ క్లైమాక్స్ కి వచ్చేసరికి సన్నివేశాలు సాగతీతగా .. రొటీన్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా అంత ప్రభావితం చేసేదిగా ఏమీ అనిపించదు. ఇక పాటలు మనసుకు పట్టుకునేలా లేకపోవడమే పెద్ద మైనస్ గా అనిపిస్తుంది. ప్రధానమైన కథాంశం కంటే, ఐశ్వర్య రాజేశ్ - కేథరిన్ - ఇజబెల్లే ఎపిసోడ్స్ ఆసక్తికరంగా ఉండటం విశేషం.
గౌతమ్ .. శీనయ్య పాత్రల్లో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. పాత్రల మధ్య వేరియేషన్స్ ను చూపించడంలో మెప్పించాడు. ముఖ్యంగా బొగ్గుగని కార్మికుడిగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ మంచి మార్కులు కొట్టేశాడు. యాక్షన్ .. ఎమోషన్ లో 'అర్జున్ రెడ్డి'ని గుర్తుకు తెచ్చాడు. రాశి ఖన్నా చాలా గ్లామరస్ గా అనిపిస్తుంది .. అక్కడక్కడా డల్ ఫేస్ తో కనిపిస్తుంది. లవ్ .. ఎమోషనల్ సీన్స్ లో బాగా చేసింది. బొగ్గు గని కార్మికుడి భార్య పాత్రకి ఐశ్వర్య రాజేశ్ చాలా చక్కగా కుదిరింది .. ఎంతో సహజంగా నటించింది. ఇక విజయ్ దేవరకొండను రెచ్చ గొట్టే పాత్రలో ప్రేక్షకులను కేథరిన్ ఎంటర్టైన్ చేసింది. కాకపోతే మునుపటి గ్లో ఆమె ఫేస్ లో కనిపించలేదు. ఇక ఇజబెల్లే మాత్రం పైలెట్ పాత్రకి కరెక్ట్ గా సరిపోయింది. స్క్రీన్ పై ఆమె కనిపిస్తున్నంత సేపు ప్రేక్షకులు చూపు తిప్పుకోలేదు. ఈ సినిమాకి ఆమె ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. ఇక జయప్రకాశ్ .. శత్రు .. ప్రియదర్శి పాత్ర పరిధిలో చేశారు.
గోపీసుందర్ అందించిన బాణీలు సందర్భానికి తగినట్టుగా వచ్చి వెళుతుంటాయిగానీ .. గుర్తుండవు. రీ రికార్డింగ్ సన్నివేశాలకి తగినట్టుగా వుంది. జయకృష్ణ కెమెరా పనితనం బాగుంది. ఇటు ఇల్లందు బొగ్గు గనులను .. అటు ప్యారిస్ అందాలను ఆయన తన కెమెరాలో బంధించిన తీరు బాగుంది. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే, ఇల్లందు - ప్యారిస్ ఎపిసోడ్స్ పెర్ఫెక్ట్ గా ఉన్నాయనిపిస్తుంది. మనసును పట్టుకునే మాటలు కూడా పెద్దగా లేవు.
ఈ కథకి బలం తక్కువ .. కథనంతో మ్యాజిక్ చేయడానికి క్రాంతిమాధవ్ తనవంతు కృషి చేశాడు. మెయిన్ లైన్ అయినప్పటికీ, ఐశ్వర్య రాజేశ్ - ఇజబెల్లే ఎపిసోడ్స్ ముందు రాశి ఖన్నా ఎపిసోడ్ తేలిపోయింది. విజయ్ దేవరకొండకి నప్పని హెయిర్ స్టైల్స్ .. పాటల్లో పస లేకపోవడం .. ప్రీ క్లైమాక్స్ నుంచి కథ పట్టు తప్పిపోవడం ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది. విజయ్ దేవరకొండ కోసం మాత్రమే థియేటర్స్ కి వెళ్లే ఆయన అభిమానులకు మాత్రం నచ్చొచ్చు.
'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీ రివ్యూ
World Famous Lover Review
జీవితం పాఠాలు నేర్పుతుంది, ప్రేమ .. పరీక్షలు పెడుతుంది. గౌతమ్ అనే ఒక ప్రేమికుడికి జీవితం ఎలాంటి పాఠాలు నేర్పింది? ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నుంచి అతనికి ఎటువంటి పరీక్షలు ఎదురయ్యాయి? వాటిని అతను ఎలా అధిగమించాడు? అనేదే ఈ సినిమా కథ. హీరోతో పాటు నలుగురు కథానాయికల పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ ఈ కథ నడుస్తుంది. అక్కడక్కడా 'అర్జున్ రెడ్డి'ని గుర్తుచేస్తూ, నిదానమైన కథనంతో సాగే ఈ సినిమా, విజయ్ దేవరకొండ అభిమానులకు నచ్చొచ్చు.
Movie Details
Movie Name: World Famous Lover
Release Date: 2020-02-14
Cast: Vijay Devarakonda, Rasi Khanna, Aishwarya Rajesh, Catherine Tresa, Izabelle Leite, jayaprakash, Priyadarshi, Shatru
Director: Kranthi Madhav
Music: Gopi Sundar
Banner: Creative Commercials
Review By: Peddinti