China: భారత్‌లోని ఆటో పరిశ్రమను వణికిస్తున్న కరోనా వైరస్.. పరిశ్రమ వర్గాల ఆందోళన

Indian Auto Industry fears about corona virus affect
  • విడిభాగాల దిగుమతులపై కరోనా దెబ్బ
  • ఇప్పుడే ఓ అంచనాకు రాలేమంటున్న మారుతి
  • వచ్చే వారానికి స్పష్టత వస్తుందన్న టాటా
చైనా కరోనా వైరస్ భారత్‌లోని వాహన తయారీ పరిశ్రమలను కూడా వణికిస్తోంది. వైరస్ కారణంగా వాహన విడిభాగాల సరఫరాలో ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని వాహన తయారీదారుల సంఘం సియామ్ ఆందోళన వ్యక్తం చేసింది. గతవారం జరిగిన ఆటో ఎక్స్‌పో, ఆటో కాంపోనెంట్స్ ఎక్స్‌పోలకు చైనాలోని పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరు కాకపోవడం ఇందుకు ఊతమిస్తోంది.

చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్స్ సంస్థ భారత్‌లో వంద కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించినా ఆ సంస్థ యాజమాన్యం కూడా ఈ ఎక్స్‌పోకు హాజరుకాలేదు. అంతేకాదు, హైమా పేరుతో వాహనాలను విక్రయించే ఎఫ్ఏడబ్ల్యూ గ్రూపు కూడా కరోనా వైరస్ కారణంగా భారత పర్యటనను రద్దు చేసుకుంది.
 
అయితే, కరోనా వైరస్ ప్రభావం చైనా నుంచి చేసుకునే ఆటో విడిభాగాల దిగుమతులపై ఏమాత్రం పడుతుందనేది ఇప్పుడే చెప్పలేమని మారుతి సుజుకి ఎండీ, సీఈవో కెనిచి అయుకవా తెలిపారు. ప్రస్తుతానికైతే ఈ విషయంలో ఎటువంటి స్పష్టత లేదన్నారు. టాటా మోటార్స్ ఎండీ, సీఈవో గుంటెర్ బషెక్ ఇదే విషయమై మాట్లాడుతూ.. చైనాలోని  ప్లాంట్లు తిరిగి తెరుచుకుని, కార్మికులు తిరిగి విధుల్లో చేరాక గానీ ఈ విషయంలో ఎటువంటి అంచనాకు రాలేమన్నారు. వచ్చే వారం ప్లాంట్లు తెరుచుకునే అవకాశం ఉందని, ఒకవేళ కార్మికులు విధులు హాజరుకాకుంటే ఆ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
China
Corona Virus
auto industry
India

More Telugu News