VV Lakshminarayana: వృత్తిని కొనసాగించడంలో తప్పేముంది?: పవన్‌ను వెనకేసుకొచ్చిన అంబికాకృష్ణ

  • రాజీనామాకు వీవీ చూపిన కారణం సహేతుకంగా లేదు
  • ఏ వృత్తిలో ఉన్న వారికి ఆ వృత్తిపైనే ఆసక్తి ఉంటుంది
  • పవన్‌ కల్యాణ్‌కే తన మద్దతని స్పష్టీకరణ
జనసేన పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడానికి సీబీఐ మాజీ జేడీ, జనసేన నాయకుడు వి.వి.లక్ష్మీనారాయణ ఎత్తిచూపిన కారణం సహేతుకంగా లేదని ప్రముఖ చిత్రనిర్మాత అంబికాకృష్ణ అన్నారు. వృత్తిని కొనసాగిస్తే అందులో తప్పుపట్టడానికి ఏముంటుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను వెనకేసుకు వచ్చారు. ప్రజాసేవ కోసం సినిమాలు వదిలేస్తున్నానని చెప్పిన పవన్‌ ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తుండడాన్ని నిరసిస్తూ లక్ష్మీనారాయణ పార్టీకి నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్‌వి నిలకడలేని రాజకీయాలని ఆయన ఘాటుగా విమర్శించారు. దీనిపై స్పందించిన జనసేనాని తనకు తెలిసింది సినిమాలేనని, మిగిలిన వ్యాపారాలేవీ లేవని గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు. పవన్‌ మాటలకు మద్దతుగా నిలిచారు అంబికాకృష్ణ.

వృత్తిని వదిలేసి రాజకీయాలు చేయాలని ఎవరూ చెప్పలేదన్నారు. లక్ష్మీనారాయణ బయటకు వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవడం తప్పుకాదని, కానీ వెళ్లిపోతూ చేసిన ఆరోపణ సరికాదని హితవు పలికారు. పవన్‌ కల్యాణ్‌ సినిమాలలో నటిస్తూ రాజకీయాల్లో కొనసాగాలని కోరుతున్నానన్నారు.
VV Lakshminarayana
ambica krishna
Pawan Kalyan

More Telugu News