Donald Trump: ట్రంప్ ఆదేశించారు.. బాగ్దాద్ ఎయిర్ పోర్టుపై దాడి చేశాం: 'పెంటగాన్' సంచలన ప్రకటన

  • ఖాసీమ్ సులేమాన్ ను హతమార్చాం
  • సంకీర్ణ సైనికుల మృతికి ప్రతీకారం తీర్చుకున్నాం
  • ఇది యూఎస్ రక్షణాత్మక చర్య
  • అధికారికంగా వెల్లడించిన పెంటగాన్
బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై దాడి చేసింది తామేనని అమెరికా సంచలన ప్రకటన చేసింది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతోనే తాము దాడి చేశామని, ఈ దాడిలో ఇరాన్ కు చెందిన క్వడ్స్ ఫోర్స్ విభాగం అధిపతి ఖాసీం సులేమాన్ హతమయ్యాడని 'పెంటగాన్' (అమెరికా రక్షణ విభాగం) అధికారికంగా వెల్లడించింది.

ఇరాక్ లో అమెరికా సైనికులపై జరిగిన దాడి వెనుక సులేమాన్ పాత్ర ఉందని, వందలాది మంది సంకీర్ణ సైనికుల మృతి వెనుక ఆయనే సూత్రధారని ఆరోపించింది. మరోమారు దాడికి ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నందున, ఆ విషయాన్ని తెలుసుకున్న తరువాత, దాడి చేశామని, ఇది అమెరికా రక్షణాత్మక చర్యని సమర్థించుకుంది.

మరోవైపు వైట్ హౌస్ కూడా బాగ్దాద్ ఎయిర్ పోర్టుపై దాడిని ధ్రువీకరించింది. బాగ్దాద్ లోని తమ దౌత్య కార్యాలయంపై ఇరాన్ మద్దతును కలిగున్న నిరసనకారులు దాడి చేశారని, దాన్ని సీరియస్ గా తీసుకున్న ట్రంప్, ప్రత్యేక బలగాలను పంపారని పేర్కొంది. ఘటన జరిగిన రెండు రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకున్నామని వెల్లడించింది.

కాగా, కొన్ని గంటల క్రితమే సులేమాన్ సిరియా నుంచి బయలుదేరి స్పెషల్ ఫ్లయిట్ లో బాగ్దాద్ విమానాశ్రయానికి రాగా, ఆపై క్షణాల్లోనే అమెరికా సైన్యం దాడికి పాల్పడటం గమనార్హం. ఆ వెంటనే ట్రంప్, తన ట్విట్టర్ ఖాతాలో యూఎస్ నేషనల్ ఫ్లాగ్ ను పోస్ట్ చేశారు. దానిపై ఏ విధమైన కామెంట్ నూ ఆయన పెట్టకపోవడం గమనార్హం. కాగా, ఈ దాడిలో ఖాసీమ్ సులేమాన్ తో పాటు ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీతో పాటు మరో ఆరుగురు కూడా మరణించిన సంగతి తెలిసిందే.
Donald Trump
Bagdad
USA
Pentagan
Airport

More Telugu News