Karnataka: కర్ణాటక సీఎం కాన్వాయ్ లో కారు బోల్తా: డ్రైవర్ కు తీవ్రగాయాలు

  • బోల్తా పడిన కారు యడియూరప్ప కార్యదర్శిది 
  • యశవంతపుర ఫ్లై ఓవర్ పై అతివేగంతో బోల్తా 
  • డివైడర్‌ను, అటువైపు రోడ్డుపై వెళ్తున్న వ్యాన్ ను ఢీకొట్టిన వాహనం

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కాన్వాయ్ లోని ఇన్నోవా కారు బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు గాయపడ్డారు. కాన్వాయ్ యశవంతపుర ఫ్లై ఓవర్ పై వెళ్తుండగా అతివేగంతో బోల్తా కొట్టింది. అనంతరం డివైడర్‌ను ఢీకొట్టి అటువైపు రోడ్డుకు వెళ్లి ఆ రోడ్డులో ప్రయాణిస్తున్న ఆటోను, అనంతరం వ్యాన్ ను ఢీకొట్టి నిలిచిపోయింది. అదృష్టవశాత్తు భారీ ప్రమాదం తప్పింది.

వివరాల్లోకి వెళితే... నిన్న ఉదయం యడియూరప్ప తుమకూరు బయలుదేరారు. ఆయన వెంట సీఎం కార్యదర్శి సెల్వకుమార్ కూడా బయలుదేరారు. కార్యదర్శితో మాట్లాడాల్సి ఉండడంతో సీఎం ఆయనను తన కారులో కూర్చోబెట్టుకున్నారు. దీంతో సెల్వకుమార్ కారు ఖాళీగా కాన్వాయ్ లో ప్రయాణిస్తోంది.

ఫ్లై ఓవర్ వద్దకు వచ్చేసరికి డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగింది. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో డ్రైవర్ వినయ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన కారణంగా ఫ్లై ఓవర్ పై అరగంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదం అనంతరం సీఎం యథావిధిగా తుమకూరు వెళ్లిపోయారు.

Karnataka
CM Ydurappa
convoy
Road Accident

More Telugu News