Pawan Kalyan: 151 సీట్లను ఇస్తే... ఇంత మోసం చేస్తారా?: పవన్ కల్యాణ్

  • రాష్ట్రంలో స్థిరత్వాన్ని నెలకొల్పుతారని ప్రజలు 151 సీట్లు కట్టబెట్టారు
  • రాష్ట్రం కోసం భూములిచ్చిన రైతులను ప్రభుత్వం మోసం చేస్తోంది
  • ప్రభుత్వమే మోసం చేయడం దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు
రాజధాని అంశంపై అన్ని ప్రాంతాల నేతలతో జనసేన నేతలు చర్చించారని... అమరావతి రైతులకు అండగా ఉండాలని అన్ని ప్రాంతాల వారు చెప్పారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

అమరావతి ప్రాంతంలోని ఎర్రబాలెంలో ఆయన ప్రసంగిస్తూ, తాము కూడా రైతులమేనని... తన చిన్నతనంలో అవసరాల కోసం తమకున్న ఐదు, ఆరు ఎకరాల భూమిని అమ్ముకుంటూ వచ్చామని.. దానికి తామెంతో బాధను అనుభవించామని చెప్పారు. అలాంటిది రాష్ట్ర ప్రయోజనాల కోసం రైతులు భూములు ఇచ్చారని... అలాంటి రైతులను ఏకంగా ప్రభుత్వం మోసం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వమే మోసం చేయడం దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదని మండిపడ్డారు. ఇది చాలా బాధాకరమని అన్నారు.

రాష్ట్రంలో స్థిరత్వాన్ని నెలకొల్పుతారనే ఉద్దేశంతోనే వైసీపీకి ప్రజలు 151 సీట్లను కట్టబెట్టారని... ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడతారని, విద్వేషాలను రాజేస్తారనే భావనతో కట్టబెట్టలేదని పవన్ అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా వైసీపీకి మంచి మెజార్టీ ఇచ్చారని... ఇప్పుడు తాను నిలబడి, మాట్లాడుతున్న ప్రాంతానికి ఎమ్మెల్యే కూడా వైసీపీ నాయకురాలేనని చెప్పారు. అయినా, వీరంతా ఇక్కడి రైతులకు అండగా లేకపోవడం బాధ కలిగిస్తోందని అన్నారు.
Pawan Kalyan
Janasena
Amaravathi

More Telugu News