Chandrababu: నేను అనని పదాన్ని అన్నట్టుగా సభలో సృష్టించారు: చంద్రబాబు
- చంద్రబాబుపై వైసీపీ సభ్యుల ఆరోపణలు
- అసెంబ్లీ ఉద్యోగిని బాస్టర్డ్ అన్నారంటూ అసెంబ్లీలో ప్రస్తావన
- ట్విట్టర్ లో ఘాటుగా స్పందించిన చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ వద్ద మార్షల్స్ తో వాగ్యుద్ధం సందర్భంగా చంద్రబాబు ఓ ఉద్యోగిని 'బాస్టర్డ్' అన్నారంటూ వైసీపీ సభ్యులు సభలో ఆరోపించడం తెలిసిందే. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అనని పదాన్ని సభలో సృష్టించారంటూ మండిపడ్డారు. తాను అన్నది మరొకటైతే, దాన్ని వక్రీకరించారని తెలిపారు. ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడమనే అప్రజాస్వామిక చర్యలకు పాల్పడింది వైసీపీ వాళ్లేనని, ఎంత ఆవేశంలోనైనా వైసీపీ వాళ్ల లాగా సంస్కారహీనమైన భాష ఉపయోగించడం, మర్యాదలేకుండా ప్రవర్తించడం తనకు రాదని చంద్రబాబు స్పష్టం చేశారు.
తనపై ఇలాంటి కుట్రలు, ఆరోపణలు చేస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఆర్నెల్ల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ కుట్రలని ఆరోపించారు. ఈ కుట్రలను ప్రజలే తిప్పికొడతారని ట్విట్టర్ లో స్పందించారు. ఈ మేరకు తాను సదరు అసెంబ్లీ ఉద్యోగితో మాట్లాడిన వీడియోను చంద్రబాబు పంచుకున్నారు.