మెగా అభిమాని నూర్ మహ్మద్ మృతి... కుటుంబ సభ్యులను పరామర్శించిన చిరంజీవి
- సంతాపం తెలియజేసిన రామ్ చరణ్, గీతా ఆర్ట్స్
- కుటుంబ సభ్యులను ఓదార్చిన అల్లు అర్జున్
- దశాబ్దాలుగా మెగా కుటుంబానికి వీరాభిమానిగా కొనసాగిన నూర్
తన వీరాభిమాని ఇక లేడన్న విషయం తెలిసి చిరంజీవి చలించిపోయారు. వెంటనే నూర్ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అల్లు అర్జున్ కూడా నూర్ భౌతికకాయాన్ని సందర్శించారు.
ఇక మెగా అభిమాని నూర్ మృతిపై మెగా యువ హీరోలు సైతం స్పందించారు. మా కుటుంబాన్ని ఎంతగానో అభిమానించే నూర్ మహ్మద్ గారు లేరంటే చాలా బాధ కలుగుతోంది అంటూ రామ్ చరణ్ స్పందించగా, మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకరిగా భావించే నూర్ భాయ్ మృతి తమను ఎంతో కలచివేసిందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామని గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది.
ఇక అల్లు శిరీష్ స్పందిస్తూ, మా పుట్టినరోజులను తన పుట్టినరోజు అన్నట్టుగా జరిపేవాడు. పండుగ వేళల్లో రుచికరమైన వంటకాలు పంపించి, మాపై అపారమైన అభిమానాన్ని చూపించేవాడు అంటూ స్మరించుకున్నారు. సాయిధరమ్ తేజ్ కూడా ట్విట్టర్ లో తన విచారాన్ని వ్యక్తం చేశారు. మెగా ఫ్యామిలీ మూలస్థంభాల్లో ఓ బలమైన స్థంభం కూలిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ విషాద సమయం నుంచి ఆయన కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, నూర్ మహ్మద్ గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నట్టు తెలుస్తోంది.

